సింహం నోటి దాకా వెళ్లి.. వచ్చింది
మెల్‌బోర్న్: కేవలం 15 ఏళ్ల చిరు ప్రాయంలో ఇండియన్-ఆస్ట్రేలియన్ బాలిక నేహా శర్మ చావు అంచు వరకు వెళ్లివచ్చింది. ఇటీవల దక్షిణాఫ్రికాలోని వన్యప్రాణుల పార్కుకు వెళ్లినప్పుడు ఆమెపై నాలుగు సింహాలు దాడి చేశాయి. దీంతో తల, మెడ, ఛాతీ, తొడలు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమయానికి జంతు సంరక్షకుడు రావడంతో ముప్పు తప్పింది. చావు తప్పదని అంతా భావించినప్పటికీ, ఆమె తిరిగి ప్రాణాలతో బయటపడింది.
ప్రస్తుతం ఆమె దక్షిణాఫ్రికాలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తన కూతురు పూర్తిగా కోలుకోవడానికి ఏడాది పట్టవచ్చని తండ్రి రాఘవ శర్మ అన్నారు. ఈ ఘటన జరిగిన కొన్నాళ్లకు జోహెన్నెస్‌బర్గ్ జూలోని సింహాలు అమెరికా పర్యాటకురాలిని చంపాయి. ఆమె ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేసి మరీ ప్రాణాలు తీశాయి. వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలు కావడం లేదడానికి ఈ రెండు ఘటనలే నిదర్శమని జంతు ప్రేమికులు అంటున్నారు.