ఆకారం మార్చుకునే రసాయన రోబోలు...
హాలీవుడ్ సినిమా టర్మినేటర్‌లో మాదిరిగా.. కరిగిపోయినా, వస్తువుల మధ్య ఇరుక్కుపోయి కుంచించుకుపోయినా.. తిరిగి మామూలు స్థితికి రాగలిగే వినూత్న రోబోలు త్వరలోనే రానున్నాయట. ఇలాంటి రోబోల తయారీకి ఉపయోగపడే ప్రత్యేక పదార్థాన్ని తాము సృష్టించామని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. చిత్రంలో మెత్తని ప్లాస్టిక్‌లా కనిపిస్తున్న వస్తువు ఆ పదార్థంతో తయారు చేసిందే. ఒకరకమైన మైనం, నురగను కలిపి చేసిన పదార్థాన్ని సన్నని తీగలకు పూసి దీనిని రూపొందించారు.
తీగలకు కరెంటును పంపినప్పుడు మైనం వేడెక్కి ఇది ద్రవస్థితిలోకి మారుతుందని, అలాగే కరెంటును ఆపేసినప్పుడు తిరిగి ఘనస్థితిలోకి మారుతుందని, దీనివల్ల ఈ వస్తువు ఆకారాన్ని మార్చుకోవడంతోపాటు ఎక్కడైనా దెబ్బతింటే కూడా తిరిగి బాగు చేసుకుంటుందనీ పరిశోధకులు చెబుతున్నారు. ఈ పదార్థంతో సూక్ష్మస్థాయి రోబోలను తయారుచేస్తే.. ఆకారం మార్చుకునే లక్షణం వల్ల ఇవి మనిషి శరీరంలో యథేచ్ఛగా తిరుగుతాయని, అందువల్ల వైద్య పరీక్షలకు, చికిత్సలకు ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు. కాస్త పెద్దస్థాయి రోబోలను తయారు చేస్తే.. భవనాలు కూలినప్పుడు శిథిలాల సందుల్లోంచి దూరిపోయి బాధితుల సమాచారం తెలుసుకునేందుకూ ఉపయోగపడతాయట.