Iran President gives Counter Warning to America President Trump | ట్రంప్‌కు ఇరాన్‌ గట్టి కౌంటర్‌ - Sakshi
Sakshi News home page

ట్రంప్‌నకు ఇరాన్‌ గట్టి కౌంటర్‌!

Jan 7 2020 10:48 AM | Updated on Jan 7 2020 3:43 PM

Hassan Rouhani Warns Trump Never Threaten The Iranian Nation - Sakshi

టెహ్రాన్‌/వాషింగ్టన్‌: ఇరాక్‌లో జరిపిన రాకెట్‌ దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌ను హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో అమెరికా జరిపిన డ్రోన్‌ దాడిలో మరణించిన ఇరాన్‌ జనరల్‌ సులేమానీ అంతిమయాత్రకు కోట్లాది మంది తరలివచ్చి అశ్రునివాళి అర్పించారు. ఈ సందర్భంగా అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ సహా సుప్రీం లీడర్‌ అయాతుల్లా అలీ ఖమేనీ ప్రతిన బూనారు. అంతేగాకుండా ట్రంప్‌ తలపై సుమారు రూ. 575 కోట్ల రివార్డు ప్రకటించినట్లు స్థానిక ప్రభుత్వ మీడియా పేర్కొంది. అదే విధంగా అమెరికా బలగాలు తమ దేశం నుంచి వెంటనే వెళ్లిపోవాలంటూ ఇరాక్‌ పార్లమెంట్‌ తీర్మానించింది. ఈ నేపథ్యంలో తాము సైతం భీకర ప్రతీకారానికి దిగుతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరికలు జారీచేశారు. దీంతో మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ నేపథ్యంలో ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ ట్రంప్‌ను మరోసారి హెచ్చరించారు. 52 ప్రదేశాలు లక్ష్యంగా దాడులకు పాల్పడతామన్న ట్రంప్‌ బెదిరింపులకు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ఇరాన్‌ను బెదిరించే సాహసం చేయొద్దని హితవు పలికారు. ఈ మేరకు.. ‘ఎవరైతే నంబరు 52 గురించి మాట్లాడుతున్నారో.. వారు 290 గురించి కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇలాంటివి ఇరాన్‌ జాతిని బెదిరించలేవు’ అంటూ 1988లో అమెరికా ఇరాన్‌లో సృష్టించిన మృత్యుఘోషను గుర్తుచేశారు. ట్రంప్‌ 52 ప్రదేశాల్లో దాడి జరిపితే... తాము 290 టార్గెట్లు పెట్టుకుంటామని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. (ట్రంప్‌ తలపై రూ.575 కోట్లు)

ఎందుకు 52.... 290?
ఇరాన్‌ ప్రతీకార హెచ్చరికల నేపథ్యంలో... ‘అమెరికన్లపై కానీ, అమెరికా ఆస్తులపై కానీ, అమెరికా స్థావరాలపై కానీ దాడులకు దిగితే ప్రతీకార దాడులు తీవ్రంగా ఉంటాయి. ఇరాన్‌లో రాజకీయంగా, సైనికంగా, సాంస్కృతికంగా అత్యంత ముఖ్యమైన 52 ప్రాంతాలను గుర్తించాం. ఆ ప్రాంతాలు లక్ష్యంగా చేసే దాడులు అత్యంత తీవ్రంగా ఉంటాయి’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. కాగా 1979-81 మధ్య  52 మంది అమెరికన్లను ఇరాన్‌ బందీలుగా చెరపట్టింది. ఈ ఉదంతాన్ని గుర్తు చేసేలా ఆ సంఖ్యను ఉటంకిస్తూ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. 

ఈ నేపథ్యంలో హసన్‌ రౌహానీ సైతం అదే రీతిలో IR655 హ్యాష్‌ట్యాగ్‌తో ట్రంప్‌నకు బదులిచ్చారు. 1988 జూలై 3న టెహ్రాన్‌ నుంచి దుబాయ్‌ బయల్దేరిన ఇరాన్‌ ఎయిర్‌ ఫ్లైట్‌ 655 ను అమెరికా నౌకాదళ క్షిపణి కూల్చివేసింది. దాడి సమయంలో విమానంలో ఉన్న మొత్తం 290 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో 66 మంది పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇది అనుకోకుండా జరిగిన దాడి అని అమెరికా చేతులు దులుపుకుంది. 1988 ఇరాన్‌- ఇరాక్‌ల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఇరాక్‌కు మద్దతుగా నిలిచిన అమెరికా... పర్షియన్‌ గల్ఫ్‌లో షిప్పింగ్‌ మార్గాల్లో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో పొరబాటున పౌర విమానాన్ని కూల్చివేశామని పేర్కొంది. అయితే ఇరాన్‌ మాత్రం అంత తేలికగా ఈ ‘నరమేధాన్ని’ మరచిపోలేదు. సులేమాని అంత్యక్రియల్లో సైతం ఈ ఘటనను గుర్తుచేసుకుంటూ.. అమెరికాకు ఇక చావే అంటూ నినదించింది. తాజాగా ఈ ఘటనను గుర్తుచేస్తూ హసన్‌ ట్రంప్‌నకు కౌంటర్‌ ఇచ్చారు.(‘కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement