
అమెరికాలో ముస్లింలను నిషేధించాలి: ట్రంప్
ముస్లింలను అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధించాలని, అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించాలని రిపబ్లికన్ పార్టీ భావి అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు.
వాషింగ్టన్: ముస్లింలను అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధించాలని, అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించాలని రిపబ్లికన్ పార్టీ భావి అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. అయితే, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ముస్లిం దేశాలతో కలసి కృషి చేస్తానని అన్నారు. డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ముందంజలో ఉన్న హిల్లరీ క్లింటన్ దీన్ని తీవ్రంగా ఖండించారు. ప్రమాదకరమైన ఈ ధోరణి సహించరానిదని అన్నారు. ట్రంప్ గురువారం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మాట్లాడారు.
కాగా, అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ పోటీ చేయడం దాదాపు ఖరారైంది. ఇప్పటికే ట్రంప్ ప్రధాన ప్రత్యర్థి టెడ్ క్రుజ్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకోగా.. తాజాగా మరో ప్రత్యర్థి అయిన ఒహియో గవర్నర్ కాసిచ్ కూడా రేసు నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు.