ట్రంప్..నోరు మూసుకో!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో డెమోక్రటిక్ పార్టీ తరఫున ముందున్న హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పై నిప్పులు చెరిగారు. భారత్ లాంటి దేశాలపై విమర్శలు చేడయం ట్రంప్ అహంకారాన్ని బయట పెడుతున్నాయని పేర్కొన్నారు. కొన్ని మతాలు, జాతులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ఇకనైనా మానుకోవాలని సూచించారు. అమెరికాలో ఉన్న భారతీయులను ట్రంప్ టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేయడం ఇతర దేశస్థులపై అతడికి ఉన్న అభిప్రాయాన్ని సూచిస్తుందని క్లింటన్ ప్రచారానికి సారథ్యం వహించిన జాన్ పొడెస్టా అన్నారు.
విదేశాలపై అనవసరంగా తప్పుడు విమర్శలు, ఆరోపణలు చేయడం కంటే నోరు మూసుకుని ఉండటం ఉత్తమమని హిల్లరీ అభిప్రాయపడ్డారు. ప్రతి దేశానికి స్నేహితులు, కొన్ని తత్సంబంధాలు అవసరమని ట్రంప్ వ్యాఖ్యల వల్ల అంతర్జాతీయంగా అమెరికాకే నష్టం వాటిల్లే అవకాశం ఉందని మేరీల్యాండ్ లో సభ అనంతరం హిల్లరీ చెప్పారు. ఇండియన్స్ మాట్లాడేది ఫేక్ ఇంగ్లీష్ అంటూ కామెంట్లు చేయడంపై డెమోక్రటిక్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఈ వ్యాఖ్యలు తనను ఉద్దేశించి చేసినవేనని క్లింటన్ ప్రచారంలో కీలక వ్యక్తి అయిన ఫ్రాంక్ ఇస్లామ్ పేర్కొన్నారు.