
హాంగ్‌కాంగ్: కరోనా వైరస్ పేరు వింటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఈ వైరస్ రోజు రోజుకు ఖండాలు, దేశాలను దాటేస్తోంది. తాజాగా కరోనా వైరస్ సోకి హాంకాంగ్‌లో ఓ వ్యక్తి మరణించాడు. చైనాలోని వుహాన్ నగరంలో మొదలైన వైరస్ ఇప్పుడు ప్రపంచంలోని 25 దేశాలను గజగజలాడిస్తోంది. కరోనా వైరస్ వల్ల చైనా బయట నమోదైన రెండవ మరణంగా దీన్ని ధృవీకరిస్తున్నారు. ఇటీవల ఫిలిప్పీన్స్‌లో 44 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్‌తో మరణించిన విషయం తెలిసిందే. (కరోనా వైరస్ తీవ్రతరం)
కాగా హాంకాంగ్‌లో ఇప్పటి వరకు 15 మందికి వైరస్ సోకింది. వారిని ఆస్పత్రుల్లోని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనావైరస్ బారిన పడి చైనాలో ఇప్పటి దాకా 425 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరో 20 వేల మందికి పైగా వైరస్ బారినపడి చికిత్స పొందుతున్నారు. హాంకాంగ్‌కు చెందిన 39 ఏళ్ళ వ్యక్తి జనవరి 21న వుహాన్ నగరానికి వెళ్లి.. 2 రోజుల్లో తిరిగి స్వదేశానికి వచ్చాడు. ఆ వెంటనే కరోనా వైరస్ లక్షణాలతో అతను ఆస్పత్రిలో చేరాడు. రక్తపరీక్షలు నిర్వహించగా అతడికి వైరస్ సోకినట్లు తేలింది. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశాడు. కాగా సోమవారం అర్థరాత్రి నుంచి చైనా భూభాగంతో ఉన్న 13 సరిహద్దు క్రాసింగ్స్‌ను హాంకాంగ్ మూసివేసింది. కరోనావైరస్ గ్లోబల్ మార్కెట్లను కుదిపేయడంతో.. పలు విమానయాన సంస్థలు చైనాకు సర్వీసులను నిలిపివేశాయి.
Comments
Please login to add a commentAdd a comment