కరోనా : చైనాపై మరో బాంబు | Virologist who fled to US from Hong Kong accuses China of coronavirus covered | Sakshi
Sakshi News home page

కరోనా : చైనాపై మరో బాంబు

Published Sat, Jul 11 2020 5:59 PM | Last Updated on Sat, Jul 11 2020 8:33 PM

Virologist who fled to US from Hong Kong accuses China of coronavirus covered - Sakshi

బీజింగ్‌:  కరోనా మహమ్మారి గురించి ప్రపంచానికి చెప్పకుండా దాచిపెట్టిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాకు సంబంధించి ఒక శాస్త్రవేత్త వెల్లడించిన కీలక విషయాలు తాజాగా సంచలనం రేపుతున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్‌ డాక్టర్‌ లి-మెంగ్‌యాన్ ప్రాణాంతక వైరస్‌ గురించి చైనాకు ముందే తెలిసినా ప్రపంచాన్ని హెచ్చరించలేదంటూ బాంబు పేల్చారు. ప్రస్తుతం అమెరికాలో అజ్ఞాతంలో ఉన్న యాన్, కరోనా వైరస్ వ్యాప్తి గురించి చైనా అబద్ధాలు చెప్పడమే కాకుండా, తరువాత మానవుల నుంచి మానవులకు వ్యాప్తి గురించి కూడా కప్పిపుచ్చిందని ఆరోపించారు. గత సంవత్సరం డిసెంబరులో మహమ్మారి విస్తరణ గురించి మాట్లాడకుండా తన నోరు మూయించారని ఆమె ఆరోపించారు. వైరస్‌ గురించి చెప్పకుండా దాచిపెట్టిందంటూ ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. మరోవైపు కరోనా గురించి ముందుగా తమను హెచ్చరించింది తమ కార్యాలయమే కానీ,  చైనా కాదని ఇటీవల డబ్ల్యూహెచ్‌ఓ  వ్యాఖ్యానించిన నేపథ్యంలో తాజా ఆరోపణలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

హాంకాంగ్‌‌ నుంచి అమెరికాకు పారిపోయిన యాన్ ప్రాణాంతక వైరస్ గురించి ముందుగానే చైనాకు తెలుసని, ప్రభుత్వ అత్యున్నత స్థాయిలోనే గోప్యత పాటించారని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇమ్యునాలజీ నిపుణురాలు యాన్ ఈ విషయాలను వెల్లడించారు. 2020 ఆరంభంలోనే కరోనా విస్తరణ ప్రారంభమైందని,  ఇన్‌ఫ్లూయేంజా వైరస్‌లు, మహమ్మారుల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ రిఫరెన్స్ లాబొరేటరీగా ప్రత్యేకతను కలిగి ఉన్న చైనాకు.. కరోనా గురించి ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు. అంతేకాదు, ఈ రంగంలో కొంతమంది అగ్రశ్రేణి నిపుణులుగా గుర్తింపు పొందిన తన పర్యవేక్షకులు తాను చేస్తున్న పరిశోధనలను కూడా విస్మరించారని ఆరోపించారు. (కరోనా : మరో సీనియర్‌ అధికారి మృతి)

కోవిడ్-19 ను అధ్యయనం చేసిన ప్రపంచ మొట్టమొదటి శాస్త్రవేత్తలలో తానూ ఒకరని చెప్పిన యాన్‌ హాంకాంగ్‌‌తో సహా విదేశీ నిపుణులను పరిశోధనకు అనుమతించటానికి చైనా ప్రభుత్వం నిరాకరించిందని చెప్పారు. 2019 డిసెంబర్ చివరలో చైనాలో నమోదవుతున్న సార్స్ వంటి కేసుల క్లస్టర్‌ను పరిశీలించమని డబ్ల్యూహెచ్ఓ రిఫరెన్స్ ల్యాబ్‌లోని డాక్టర్ లియో ఆదేశించినట్టు గుర్తు చేసుకున్నారు. తనపై దేశద్రోహం ఆరోపణలు చేస్తున్నారనీ, మాతృదేశ ప్రతిష్టను దెబ్బతీశానంటూ తనను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే తన స్వస్థలమైన కింగ్డావోను స్వాధీనం చేసుకోవడంతోపాటు, తన తల్లిదండ్రులను కూడా ప్రశ్నించారని యాన్‌ వాపోయారు. ప్రభుత్వ గూండాలు తనపై సైబర్ దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. అయినా తన  పోరాటాన్ని వదులుకోనని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే అమెరికాకు పారిపోయినట్టు ఫాక్స్ న్యూస్‌తో చెప్పారు. ఇదే చైనాలో ఉండగానే వెల్లడిస్తే తనను  మాయం చేయడం లేదా చంపేస్తారని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ తన జీవితం ఇంకా ప్రమాదంలో ఉందని యాన్ అభిప్రాయపడ్డారు.  తన ఇంటికి తిరిగి వెళ్లలేమోననే భయం పీడిస్తోందన్నారు. 

ఇది ఇలా వుంటే హాంకాంగ్ విశ్వవిద్యాలయం ఆమె పేజీని తొలగించింది. డాక్టర్ లి-మెంగ్ యాన్ ఇకపై తమ సిబ్బంది కాదని విశ్వవిద్యాలయం ప్రకటించింది. ప్రస్తుత, మాజీ ఉద్యోగుల పట్ల గౌరవంతో వారి వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వలేమని పేర్కొంది. అధికారికంగా వార్షిక సెలవులో ఉన్నట్టుగా చెప్పిన తర్వాత కూడా ఆన్‌లైన్ పోర్టల్స్, ఇమెయిల్‌  యాక్సెస్‌ను ఉపసంహరించు​కోవడం గమనార్హం. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ 1.26 కోట్ల మంది కరోనా వైరస్ బారినపడగా, 5.62 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement