యుక్తవయస్సుకు రాగానే పిల్లల్లో ఎన్నో మార్పులు. అన్ని రోజులు తల్లిదండ్రుల మాటే వేదంగా భావించే అంతర్ముఖుల్లో కూడా ఎన్నో మార్పులు వస్తుంటాయి. మంచి చేదుగా అనిపిస్తుంది, చెడు త్వరగా ఆకర్షిస్తుంది. స్నేహితులే ప్రపంచమవుతారు. అంతకుముందు చూడని కొత్త లోకం కనిపిస్తుంది. మొత్తనికి ప్రపంచమే చాలా కొత్తగా కనిపిస్తుంది. కొత్త అలవాట్లు వచ్చి చేరతాయి. రాముడు మంచి బాలుడు అని అనిపించుకున్న వారిని సైతం చెడ్డవారిని చేస్తుంది కౌమార దశ. ఇన్నిరోజులు ఈ మార్పులకు కారణం హర్మోన్ల ప్రభావం అనుకున్నాం. కానీ ఇది నిజం కాదట. కౌమార దశలో పిల్లల సామాజిక ప్రవర్తనలో మార్పుకు కారణం పునరుత్పిత్తి హర్మోన్ల ప్రభావం కాదట. ఈ విషయాన్ని బఫెలో యూనివర్శీటీకి చెందిన ప్రముఖ రచయిత మాథ్యూ పాల్ వెల్లడించారు.
యుక్తవయసులో శరీరంలో వచ్చే అన్నిమార్పులకు కారణం పునరుత్పత్తి హర్మోన్లే. అయితే ఇంతకాలం కౌమార దశలో వచ్చే సామాజిక ప్రవర్తనలో మార్పుకు కూడా ఈ హర్మోన్లే కారణం అనుకున్నాం. కానీ పాల్, అతని సహచరులు కలిసి చేసిన నూతన పరిశోధన ఇది అబద్దమని నిరూపించింది. ఇంతకు ముందు ప్రయోగాలు నిరూపించలేని అనేక విషయాలను వీరు రుజువు చేశారు. అందుకోసం వీరు నూతన విధానాన్ని కనుగొన్నారు. దాని ప్రకారం ప్రతి ఒక్కరిలో యుక్తవయస్సులో వచ్చే మార్పులును వీరు పరిశీలించారు.
‘ఈ దశలో సంక్లిష్ట ఆలోచన విధానం అభివృద్ధి చెందుతుంది. అనేక మానసిక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ప్రమాదకర ప్రవర్తన విధానం ముఖ్యంగా మాదకద్రవ్యాల వినియోగం వంటి అంశాలు ప్రారంభదశలో ఉంటాయి. సామాజిక ప్రవర్తన అంశానికి వచ్చినట్లయితే, అన్ని రోజులు తల్లిదండ్రులను అంటిపెట్టుకుని ఉన్నవారు పూర్తిగా వేరే ప్రపంచం వైపు ఆకర్షితులౌతారు. అక్కడ వారు కలుసుకునే వ్యక్తులను బట్టి వారి సామాజిక ప్రవర్తన ఉంటుంది. పునరుత్పత్తి హర్మోన్ల ప్రధాన విధి ప్రత్యుత్పత్తి సామర్ధ్యం, రెండో దశ లైంగిక లక్షణాలను పెంపొందించడం, గోనడల్ హర్మోన్స్ పెరుగుదల వంటివి మాత్రమే’ అని తమ పరిశోధనలో తేల్చారు.
ప్రస్తుతం పాల్ రూపొందించిన విధానం వల్ల పునరుత్పత్తి హర్మోన్లు కలిగించే మార్పులేంటో సులభంగా గుర్తించవచ్చు. యవ్వనము విశాలమైనదని, దీనిలోనే కౌమార దశ కూడా ఉంటుందని దాంతో పాటు యుక్తవయసులో జరిగే మేథోవికాసం, సామాజిక, భావోద్వేగ మార్పులను కూడా కలిగి ఉంటాయని పాల్ చెప్పారు. ఈ మార్పులను గుర్తించడం వల్ల కౌమార దశ అభివృద్ధికి బాధ్యత వహించే అంతర్లీన యంత్రాంగాలను అర్థం చేసుకోవడంతో పాటు జీవితంలో మున్ముందు వచ్చే మానసిక ఆరోగ్య సమస్యలకు కారణాలను కూడా విశ్లేషించవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment