మందు తాగితే ఎందుకు లావెక్కుతారు? | How Alcohol Consumption Makes You Fat | Sakshi
Sakshi News home page

అందుకే మందు తాగితే లావెక్కుతారు?

Published Thu, Aug 22 2019 5:21 PM | Last Updated on Thu, Aug 22 2019 8:59 PM

How Alcohol Consumption Makes You Fat - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : మద్యం సేవించే వారిలో కొందరు అనూహ్యంగా లావెక్కుతుంటారు. అందుకు కారణం మద్యం మత్తులో వారు మస్తుగా తినడమేనని, మద్యంలో కాలరీలు, తీసుకునే ఆహారంలో కాలరీలు ఉండడం వల్ల కాలరీలు ఎక్కువై లావు అవుతారని చెప్పే వైద్యులు.. నమ్మే మందుబాబులు లేకపోలేదు. తాము అతి తక్కువ కాలరీల మద్యం సేవిస్తామని, అతి తక్కువ కాలరీల ఆహారం తీసుకుంటామని, అయినా ఎందుకు లావెక్కుతున్నామని లాజిక్కు ప్రశ్నించే వారు లేకపోలేదు. మద్యం తాగేవారు ఎందుకు లావెక్కుతారో మొదటి సారి శాస్త్రీయ కారణాన్ని కనుగొన్నారు. ‘మద్యం మన శరీరంలో ప్రవేశించగానే దాన్ని ఒక రకమైన విష పదార్థంగా మనలోని కాలేయం గుర్తిస్తుంది. వెంటనే అందులోని కాలరీలను కరగించి దాని అంతు చూడాలని భావించి.. అందుకు ప్రాధాన్యత ఇస్తుంది. మద్యంలో ఒక్క కాలరీని కూడా వదిలేయకుండా అన్ని కాలరీలను కరగించాలని భావించి అందుకు తన శక్తి మేరకు కాలేయం కృషి చేస్తుంది. ఆహారం రూపంలో వచ్చే కాలరీలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. పట్టించుకోదు. పర్యవసానంగా మన శరీరంలో ఆహారం తాలూకు కాలరీలు కొవ్వు రూపంలోకి మారి స్థిర పడుతుంది’ అని లండన్‌కు చెందిన డాక్టర్‌ జో హార్కాంబే, డాక్టర్‌ సారా బ్రీవర్‌ చెప్పారు.

మద్యంలోని కాలరీలను కరగించడం కూడా మనిషిలోని కాలేయం శక్తి మీద ఆధారపడి ఉంటుందని, మద్యం కాలరీలు మరీ ఎక్కువై, కాలేయం శక్తి అంతగా లేకపోతే మద్యంలోని కాలరీలు కూడా మిగిలి పోతాయని, అలా మిగిలిపోయిన మద్యం కాలరీలు మన శరీరంలోని ‘ఆల్ద్‌1ఏ1’ అనే ఎంజైమ్‌ కొవ్వుగా మారుస్తుందని, అలాంటి కొవ్వు సహజంగా శరీరంలోని అంతర్‌ అవయవాల చుట్టూ చేరుతుందని డాక్టర్‌ సారా బీవర్‌ వివరించారు. ఇక ఆహారం ద్వారా వచ్చిన కాలరీలు ప్రధానంగా నడుము చుట్టూ, పొట్ట వద్ద, ఇతర కండరాల వద్ద పేరుకుపోతుందని తెలిపారు. 

ఇక కాలరీలు లేని మద్యం ఉండదని, కాకపోతే ఎక్కువ, తక్కువ కాలరీలు ఉంటాయని, ఆల్కహాల్‌ రూపంలో వచ్చే కాలరీలను వెంటనే బర్న్‌ చేసేందుకు కాలేయం ప్రయత్నిస్తుందని ‘ది డైట్‌ ఫిక్స్‌’ రచయిత అయిన డాక్టర్‌ హార్కాంబే తెలిపారు. తక్కువ కాలరీల మద్యం, ఆహారం తీసుకోవాలనుకునే వారు తక్కువ కార్బొహైడ్రేట్లను తీసుకోవాలని ఆమె సూచించారు. 100 కాలరీల మద్యం, వంద కాలరీల పాస్తా తీసుకున్నట్లయితే 100 కాలరీల మద్యాన్ని బర్న్‌ చేసే వరకు కాలేయం పాస్తా జోలికి వెళ్లదని ఆమె చెప్పారు. ఒక్క గ్లాస్‌ వైన్‌లో 75 గ్రాముల కాలరీలు ఉంటాయని, అది కిలోమీటరు జాగింగ్‌కు సమానమని, ఓ క్యాన్‌ బీర్‌లో 136 కాలరీలు ఉంటాయని, అది రెండు కిలోమీటర్ల జాగింగ్‌తో  సమానమని, బాటిల్‌ సోడాలో 177 కాలరీలు ఉంటాయని, అవి రెండున్నర కిలోమీటర్ల జాగింగ్‌తో సమానమని ఆ వైద్యులిద్దరు ఓ లండన్‌ మీడియా వెబ్‌సైట్‌కు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. మద్యంతో మరో ప్రమాదం ఉందని కూడా తేల్చి చెప్పారు. రక్తంలో గ్లూకోజ్‌ను మన శరీరంలోని ‘గ్లూకాగాన్‌’అనే హార్మోన్‌ నియంత్రిస్తుందని, మద్యం ఎక్కువగా సేవించడం వల్ల శరీరంలో ఈ హార్మోన్‌ ఉత్పత్తి పడిపోతుందని వారు హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement