అగ్నికి ఆహుతి | Huge fire engulfs tower block in west London | Sakshi
Sakshi News home page

అగ్నికి ఆహుతి

Published Thu, Jun 15 2017 1:12 AM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM

అగ్నికి ఆహుతి

అగ్నికి ఆహుతి

లండన్‌లో భారీ అగ్నిప్రమాదం
12 మంది మృతి.. 74 మందికి గాయాలు
►  కాలిబూడిదైన 24 అంతస్తుల భవనం
మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం
పిల్లలను కాపాడేందుకు కిందకు జారవిడిచిన తల్లిదండ్రులు


లండన్‌: ఇటీవల జరిగిన ఉగ్రదాడులను మరవకముందే బ్రిటన్‌ రాజధాని లండన్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. పశ్చిమలండన్‌లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ 24 అంతస్తుల భవనంలో అందరూ ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 12 మంది సజీవదహనం కాగా.. 74 మం దికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. 120 ఫ్లాట్లుండే ప్రమాదం జరిగిన లాంకస్టర్‌ వెస్ట్‌ ఎస్టేట్‌లోని గ్రెన్‌ఫెల్‌ టవర్‌లో ఘటన జరిగిన సమయంలో దాదాపు 600 మంది వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.

మం టలు ఇంకా ఎగసిపడుతుండటంతో.. భవనం కూలిపోయే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. భవనం కూలిపోకుండా స్ట్రక్చరల్‌ ఇంజనీర్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భవనం నుంచి బాధితులను కాపాడేందుకు భారీ ఆపరేషన్‌ కొనసాగుతోంది. 250మంది అగ్నిమాపక దళ సిబ్బంది మంటలను ఆర్పేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మంట లు ఎగసిపడుతుండగానే చాలా మందిని వీరు క్షేమంగా బయటకు తీసుకొచ్చారు.  ‘అయినా ఇంకా చాలా మంది జాడ తెలియటం లేదు’ అని లండన్‌ మేయర్‌ సాదిక్‌ ఖాన్‌ వెల్లడించారు. ఇది చాలా పెద్ద ప్రమాదమని, భవనం భద్రత విషయానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్నామన్నారు. భారీ ప్రమాద ఘటనపై బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే విచారం వ్యక్తంచేశారు.

హృదయవిదారకం!
అందరూ ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఎటువైపు వెళ్లాలో తెలియక భవనంలో ఉన్నవారు కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. బతికించండంటూ వేడుకున్నారు. వీరి అరుపులు, ఆర్తనాదాలతో ఈ ప్రాంతమంతా మార్మోగింది. అగ్నిమాపక సిబ్బంది ఓవైపు నుంచి ప్రయత్నాలు చేస్తూ వీలైనంత మందినిS క్షేమంగా కిందికి దించారు. అయినా ఎగసిపడుతున్న అగ్నికీలలు ఒక్కో ఫ్లాటును, ఒక్కో అంతస్తును మింగేస్తూ పైపైకి ఎగబాగాయి. దీంతో కొందరు కిటికీల్లోనుంచి దుప్పట్ల సాయంతో కిందికి దిగే ప్రయత్నం చేస్తే.. మరికొందరు కిందికి దూకేశారు. తామెలాగూ బతకలేమనుకున్న తల్లిదండ్రులు కనీసం తమ పిల్లలనైనా కాపాడాలంటూ.. కిందనుంచి ప్రమాదాన్ని గమనిస్తున్న వారివైపు జారవిడిచారు. 

‘భవనం నుంచి చాలా మంది సహాయం కోసం అరుస్తున్నారు. ఇంతలో తొమ్మిదో అంతస్తు నుంచి ఓ మహిళ కిటికీలోనుంచి కింద గుమిగూడిన వారిని చూస్తూ.. పాపను కిందకు వదిలేస్తున్నట్లు సైగల ద్వారా చెప్పి వదిలేసింది. కిందనున్న ఓ వ్యక్తి పరిగెత్తి ఆ పాపను క్షేమంగా పట్టుకున్నారు’ అని సమీరా అనే ప్రత్యక్షసాక్షి వెల్లడించారు. చిన్నారులు కూడా బతికించండంటూ చేసిన ఆర్తనాదాలు చాలా బాధ కలిగించాయని.. దీన్ని జీవితంలో మరిచిపోలేనని ఆమె తెలిపారు. ఓ మహిళ కూడా ఇలాగే తన ఐదేళ్ల కుమారుడిని బయటకు విసిరేసిందని, ఆ బాలుడు కూడా క్షేమంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. అతికష్టం మీద ప్రాణాలతో బయటపడిన వారి బాధ వర్ణనాతీతం.

రోజుల తరబడి సహాయక చర్యలు
‘ప్రస్తుతానికి ఆరుగురు అగ్నికి ఆహుతయ్యారు. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో సహాయకచర్యలు కొన్ని రోజుల వరకు కొనసాగే అవకాశాలున్నాయి. దీంతో మృతుల సంఖ్యపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేం’ అని లండన్‌ మెట్రోపాలిటన్‌ పోలీస్‌ కమాండర్‌ స్టువర్ట్‌ కండీ స్పష్టం చేశారు. ముందుగా బాధితులను కాపాడి వారికి సరైన వైద్యం అందించడమే ముఖ్యమని.. ఆ తర్వాతే ప్రమాదానికి కారణాలపై విచారణ కొనసాగుతుందన్నారు. మృతులను ఇంతవరకూ గుర్తించలేదని కూడా ఆయన వెల్లడించారు.

‘ఈ ఘటన ఊహించేందుకే భయంగా ఉంది. ఇంత భయంకరమైన అగ్నిప్రమాదాన్ని నా 29 ఏళ్ల ఉద్యోగ జీవితంలో చూడలేదు. ఘటన తెలియగానే ఓవైపు బాధితులను కాపాడుతూనే.. పక్కనున్న భవంతుల్లో ఉండేవారిని ఖాళీ చేయించాం’ అని ఫైర్‌ బ్రిగేడ్‌ చీఫ్‌ డేనీ కాటన్‌ తెలిపారు. ఈ దుర్ఘటనకు కారణమేంటో ఇంకా తెలియరాలేదన్నారు. అయితే.. మూడు లేదా నాలుగో అంతస్తులో ఓ రిఫ్రిజిరేటర్‌ కారణంగానే మంటలు మొదలై ఉండొచ్చని.. ఆ వెంటనే వరుసగా ఒక్కో ఫ్లాట్‌కు మంటలంటుకుని మొత్తం భవనం దగ్ధమయినట్లు అధికారులు భావిస్తున్నారు.

విచారణ తర్వాతే అసలు కారణం తెలుస్తుందన్నారు. గతేడాదే ఈ భవనాన్ని భారీమొత్తం వెచ్చించి పునరుద్ధరించారు. అయితే అగ్నిప్రమాదాన్ని పసిగట్టి స్పందించే వ్యవస్థ విషయంలో తీవ్రమైన లోపం కారణంగానే ఇంత భారీ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. భవన దుర్ఘటన బాధితులను ఆదుకునేందుకు పశ్చిమలండన్‌లోని గురుద్వారాలు, మసీదులు, చర్చిలు ముందుకొచ్చాయి. ప్రజలనుంచి సేకరించిన దుస్తులు, ఆహార పదార్థాలను రగ్బీ కమ్యూనిటీ సెంటర్‌లోని బాధితులకు అందజేశాయి.

ముస్లిం కుటుంబాలే ఎక్కువ
దుర్ఘటనకు కారణమైన గ్రెన్‌ఫెల్‌ టవర్‌లో ఎక్కువగా ముస్లిం కుటుంబాలే నివాసముంటున్నాయని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో చాలా మంది మెలకువగానే ఉన్నారన్నారు. రంజాన్‌ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు ప్రారంభించేందుకు తెల్లవారుజామున భోజనం చేస్తున్న సమయంలోనే మంటలు చుట్టుముట్టాయన్నారు. రంజాన్‌ కారణంగా తెల్లవారుజామునే లేవటంతో తీవ్రతను ముందుగానే పసిగట్టి కుటుంబంతో సహా ప్రాణాలతో బయటపడ్డట్లు మహ్మద్‌ అనే వ్యక్తి తెలిపారు. ప్రాణాలతో బయటపడిన వారిని సమీపంలోని రగ్బీ పోర్టోబెల్లో కమ్యూనిటీ సెంటర్‌కు చేర్చారు. అక్కడే వారికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు.

బాధితుల మాటల్లోనే
‘మంటలు అంటుకున్న విషయం తెలియగానే మెట్లగుండా బయటకు వచ్చే ప్రయత్నం చేశాను. అంతలోనే ఫైర్‌ఫైటర్లు లోపల చిక్కుకున్న చాలా మందిని కాపాడేందుకు పైకొస్తున్నారు. వారే నన్ను క్షేమంగా కిందికి పంపించారు’ అని ఏడో అంతస్తులో ఉండే పాల్‌ మునాక్ర్‌ తెలిపారు. ‘మంచి నిద్రలో ఉన్నాను. ఇంతలోనే ఏదో శబ్దమైందని మేల్కొనే లోపే దట్టమైన పొగ ఆవహించింది. పొగ అలారం మోగుతూనే ఉంది. చూస్తుండగానే నాలుగో అంత స్తు నుంచి 23వ అంతస్తుకు పాకిపోయింది’ అని జోయ్‌ అనే మరో బాధితురాలు ఆవేదనగా వెల్లడించారు. ఈ భవనంలో ఉం టున్న తమవారి క్షేమసమాచారం, బాధితుల బంధువులు ఆసుపత్రులు, కమ్యూనిటీ సెంటర్ల వద్ద ఆత్రుతతో వెదుకుతున్నారు.

మంటల ఉధృతికి రెయిన్‌స్క్రీన్‌ కారణమా?
మంటలు ఇంతగా ఎగసి పడటానికి భవనానికి ఉన్న రెయిన్‌స్క్రీన్‌ (బయటి వేడి ప్రభావం లోపలకు రాకుండా ఉండేందుకు, భవనాన్ని ఆధునికంగా మార్చేందుకు గోడలకు అమర్చే ఒక తొడుగు) కారణం అయ్యుండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. రెయిన్‌స్క్రీన్‌లను సాధారణంగా చెక్క, ప్లాస్టిక్, లోహాలతో తయారుచేస్తారు. ప్రమాదం జరిగిన భవనం 1974లో నిర్మితమైనది. 2016లో దీనిని ఆధునీకరించారు. అప్పుడే రెయిన్‌స్క్రీన్‌ ఏర్పాటు చేశారు. వాస్తవానికి మంటలు రెండు లేదా మూడు అంతస్తులకు పరిమితం అవ్వాల్సినవనీ, రెయిన్‌స్క్రీన్‌వల్లే నిమిషాల్లో భవనం మొత్తానికి వ్యాపించాయని నిపుణులంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement