
హరికేన్ ‘ఇర్మా’ బీభత్సం
► కరీబియన్ దీవుల్లో కనీవినీ ఎరుగని విధ్వంసం
► ఆరుగురి మృతి, నేలమట్టమైన వేలాది ఇళ్లు
సాన్ జువాన్, మయామి: కరీబియన్ దీవుల్లో హరికేన్ ఇర్మా కనీవిని ఎరుగని విధ్వంసం సృష్టించింది. ఇర్మా ధాటికి ఇంతవరకూ ఆరుగురు మరణించగా, వేలాది ఇళ్లు నేలమట్టమవడంతో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడ్డ హరికేన్లలోకెల్లా అత్యంత శక్తిమంతమైన ఈ తుపాను గత రెండు రోజులుగా కరీబియన్ దీవుల్ని అతలాకుతలం చేసి అమెరికాలోని ఫ్లోరిడా తీరం వైపు దూసుకెళ్తోంది. డొమినికన్ రిపబ్లిక్, హైతీలను అతలాకుతలం చేసిన హరికేన్ క్యూబా, బహమాస్ మీదుగా ఆదివారం ఫ్లోరిడా తీరాన్ని తాకవచ్చని, విధ్వంసం ఊహించని స్థాయిలో ఉంటుందని అమెరికా వాతావరణ శాఖ తేల్చింది.
గంటకు 298 కి.మీ. వేగంతో వీచిన పెనుగాలులకు కరీబియన్ దీవులైన సెయింట్–మార్టిన్, సెయింట్–బార్తెలెమి, బార్బుడా, అంగ్విల్లా, వర్జిన్ ఐలాండ్స్, ప్యూర్టోరికోలు కోలుకోలేనంతగా దెబ్బతిన్నాయి. సెయింట్ మార్టిన్‌లో నలుగురు, అగ్విల్లా, బార్బుడాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. ఫ్రాన్స్ దీవులైన సెయింట్–మార్టిన్, సెయింట్–బార్తెలెమిలో ఊహించనంత నష్టం జరిగిందని ఫ్రెంచ్ అంతర్గత వ్యవహారాల మంత్రి చెప్పారు. సెయింట్ మార్టిన్ 95% దెబ్బతింద ని స్థానిక అధికారి చెప్పారు. బ్రిటిష్ దీవులు అంగ్విల్లా, వర్జిన్ ఐలాండ్స్‌లో భారీ విధ్వంసం చోటుచేసుకుందని బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి అలాన్ డంకన్ చెప్పారు.
ప్యూర్టోరికోలో దారుణ పరిస్థితి
అమెరికా అధీనంలోని స్వతంత్ర దేశం ప్యూర్టోరికోపై ఇర్మా పెను ప్రభావం చూపింది. దాదాపు 10 లక్షల మంది ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. 50 వేల మందికి తాగునీటి సరఫరా నిలిచిపోయిందని అత్యవసర సహాయ విభాగం తెలిపింది. డొమినికన్ రిపబ్లిక్, హైతీల్ని వణికిస్తున్న ఇర్మా.. క్యూబా, బహమాస్ మీదుగా ఫ్లోరిడా తీరం వైపు కదులుతోంది. పెను విధ్వంసం వల్ల సహాయక బృందాలు కరీబియన్ దీవులకు చేరడం కష్టంగా మారింది. బార్బుడా దీవిలో దాదాపు 60 శాతం మంది నిరాశ్రయులయ్యారని అంటిగ్వా, బార్బుడా ప్రధాని గాస్టన్ బ్రౌన్ వెల్లడించారు.
వణికిస్తున్న మరో రెండు హరికేన్లు
అట్లాంటిక్ సముద్రంలో మరో రెండు హరికేన్లు బలపడ్డాయి. హరికేన్ జోస్ గంటకు 207 కి.మీ వేగంతో ఇర్మా దారిలోనే ప్రయాణించవచ్చని అంచనావేస్తున్నారు. హరికేన్ కతియా మెక్సికో వైపు దూసుకుపోతోంది.
285 కి.మీ. వేగంతో గాలులు
గురువారం ఉదయానికి ఇర్మా కొద్దిగా బలహీనపడినా కేటగిరీ 5 స్థాయిలోనే కొనసాగుతోందని గంటకు 285 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయని అమెరికా జాతీయ హరికేన్ సెంటర్ తెలిపింది. ఫ్లోరిడా రాష్ట్ర గవర్నర్ అత్యవసర పరిస్థితి విధించారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని స్థానికులకు సూచించారు. ఫ్లోరిడా తీర ప్రాంతంలో ఇర్మా ధాటికి తీవ్ర నష్టం వాటిల్లవచ్చని, ఫ్లోరిడాతో పాటు జార్జియా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో భారీ విధ్వంసం జరగవచ్చని ఆందోళన చెందుతున్నారు. అయితే ఇర్మా ఫ్లోరిడాలోని ఏ ప్రాంతంలో తీరాన్ని తాకవచ్చో అనేది అంచనా వేయలేకపోతున్నారు. అమెరికా చరిత్రలోనే అత్యంత నష్టాన్ని మిగిల్చే తుపానుగా మిగిలిపోవచ్చని యూనివర్సిటీ ఆఫ్ మయామికి చెందిన హరికేన్ పరిశోధకుడు బ్రియాన్ మెక్ నోల్డీ చెప్పారు.