అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటా
బీరుట్ : తన తండ్రి ఒసామా బిన్ లాడెన్‌ను దారుణంగా చంపిన అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటానని అతని కొడుకు హంజా బిన్ లాడెన్ హెచ్చరించాడు. ఈ మేరకు అతను మాట్లాడిన ఒక ఆడియోను అల్‌కాయిదాకు చెందిన మీడియా విభాగం అస్-సాహబ్ శనివారం విడుదల చేసింది. ఇందులో హంజా బిన్ లాడెన్ మాట్లాడుతూ.. అమెరికా నేతల నిర్ణయాలకు అమెరికన్లు జవాబుదారులన్నాడు. ముస్లింలను అణచివేస్తున్నందుకు ప్రతిగా అమెరికాపై జిహాద్ లేదా పవిత్ర యుద్ధాన్ని అల్‌కాయిదా కొనసాగిస్తుందని స్పష్టం చేశాడు.
అబొట్టాబాద్‌లో మీరు చేసిన పాపకార్యానికి ఏ శిక్ష పడకుండానే తప్పించుకున్నామని భావిస్తే.. అది పొరపాటేనని వ్యాఖ్యానించాడు. అయితే లాడెన్ కుమారుని జాడ ఇప్పటివరకు తెలియరాలేదు. ప్రస్తుతం అతను అల్‌కాయిదా నాయకత్వ బాధ్యతలను చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.