న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ విమానం ప్రయాణించేందుకు వీలుగా గగనతల అనుమతి ఇచ్చేందుకు పాకిస్తాన్ నిరాకరించడాన్ని భారత ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ పౌర విమానాయాన సంస్థ (ఐసీఏవో) దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీఏవో పాక్ వివరణ కోరింది. మోదీ యూఏఈ పర్యటన నేపథ్యంలో పాకిస్తాన్ గగనతలం నుంచి ప్రయాణించేందుకు భారత్ ఆ దేశ ప్రభుత్వాన్ని కోరగా అందుకు అనుమతించలేదు. దీంతో మరో ప్రత్యామ్నాయ మార్గం గుండా ప్రధాని యూఏఈ పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను కేంద్రం రద్దు చేయడంతో పాకిస్తాన్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నాయంటూ దాయాది తమ గగనతలంలో భారత విమానాలు ప్రయాణించకుండా నిషేధం విధించింది.
ఇదే అంశం మీద భారత్ అంతర్జాతీయ విమానయాన సంస్థకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును అందుకున్న అంతర్జాతీయ విమానయాన సంస్థ అధ్యక్షుడు ఒలుముయివా బెనార్డ్ అలియూ దీనిపై పాకిస్తాన్ వివరణ కోరారు. పాక్ నుంచి వచ్చే సమాధానం బట్టి తదుపరి చర్యలు ఉంటాయని ఐసీఏవో తెలిపింది. అయితే భారత్‌కు చెందిన వీవీఐపీలు ప్రయాణించే ప్రత్యేక విమానాలకు పాకిస్తాన్ గగనతలంలో అనుమతులపై ఇంకా స్పష్టత లేదు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించే విమానానికి ఇప్పటికే రెండుసార్లు అనుమతి నిరాకరించినప్పటికీ.. భారత్ సంయమనం పాటించింది. తాజాగా యూఏఈ పర్యటనకు ప్రధాని నరేంద్రమోదీ బయలుదేరుతున్న నేపథ్యంలో భారత్ మరోసారి గగనతల అనుమతి కోరింది. తాజాగా కూడా పాక్ అనుమతి నిరాకరించడంతో ఫిర్యాదు చేయడమే సరైన చర్యగా భావించి ఫిర్యాదు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
చదవండి : పాకిస్థాన్‌పై భారత్ సీరియస్
Comments
Please login to add a commentAdd a comment