పెషావర్ : పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ఖాన్ ఆగస్టు 11న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నెల 25న జరిగిన పాక్ జాతీయ ఎన్నికల్లో 116 సీట్లతో నేషనల్ అసెంబ్లీలో పీటీఐ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 172 సీట్లు అవసరం కాగా, మరో 56 మంది ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టేందుకు ఇమ్రాన్ సిద్ధంగా ఉన్నారు.
కొన్ని చిన్న పార్టీల నేతలతో ప్రభుత్వ ఏర్పాటు విషయమై చర్చించినట్లు ఇమ్రాన్ వెల్లడించారు. కైబర్ ఫంఖ్తువా ముఖ్యమంత్రి ఎవరన్నది మరో 48 గంటల్లో ప్రకటిస్తానని తెలిపారు. ప్రజా ప్రయోజనాలతో పాటు పాక్‌లో మార్పు కోసం తాను ప్రధాని బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఇమ్రాన్ వివరించారు. మరోవైపు పాక్‌లో ఇతర ప్రధాన పార్టీలైన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్)ల నేతలు సంయుక్తంగా పీటీఐకి అధికారం రాకుండా అడ్డుకోవాలని యత్నిస్తున్నారు.
అంతకుముందు పీటీఐ అధికార ప్రతినిధి నయీముల్ హక్ మీడియాతో మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఆగస్ట్ 14లోపే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తాడని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా అవసరమైన సీట్ల కోసం చిన్న పార్టీలైన ముత్తహిద కౌమి మూవ్‌మెంట్ పాకిస్తాన్ (ఎంక్యూఎం-పీ), ద గ్రాండ్ డెమొక్రటిక్ అలియన్స్ (జీడీఏ), పీఎంఎల్-కాయిద్ (పీఎంఎల్- క్యూ), బలొచిస్తాన్ అవామీ పార్టీ (బీఏపీ)తో పాటు ఇటీవలి ఎన్నికల్లో నెగ్గిన స్వతంత్ర అభ్యర్థులతో ఇమ్రాన్, పీటీఐ కీలక నేతలు చర్చలు జరపనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment