'ఇక ఖాళీ విమానాలే పంపిస్తాం.. నో ప్యాసింజర్స్'
మాస్కో: ఈజిప్టుకు అన్ని రకాల ఫ్యాసింజర్ విమానాల సర్వీసులను రష్యా నిలిపివేసింది. బాంబు దాడి వల్లే రష్యా విమానం గతవారం కూలిపోయిందని అమెరికాతోపాటు బ్రిటన్ కూడా చెప్పడంతో ప్రస్తుతానికి ఈ ఈజిప్టు, రష్యాల మధ్య సర్వీసులను ఆపేసింది. దీంతో రెండు దేశాల మధ్య ఇది కొత్త సమస్యగా మారింది. గత నెల 31న బయలుదేరిన మెట్రోజెట్ ఎయిర్ బస్ 321-200 రష్యా విమానం కొద్ది సేపటికే కుప్పకూలి దాదాపు 224మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
అనంతరం ఆ విమానాన్ని తామే కూల్చి వేశామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అయితే, ఇప్పటి వరకు అధికారికంగా అటూ ఈజిప్టుగానీ, రష్యాగానీ ఉగ్రవాద సంస్థ ప్రకటనను ఆమోదించలేదు. తాజాగా, అమెరికా, బ్రిటన్ దేశాలు బలమైన బాంబు దాడి మూలంగానే రష్యా విమానం కూలిపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశాయి. పరోక్షంగా ఈజిప్టు కూడా శుక్రవారం సాయంత్రం బాంబు దాడివల్లే ఈ విమానం కూలిపోయినట్లు భావిస్తున్నామని అనుమానం వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు రద్దయ్యాయి. రష్యా నుంచి ఎలాంటి ప్రయాణికులతో కూడిని విమానాలను ఈజిప్టుకు పంపించబోమని కాకపోతే అక్కడ ఉన్న తమ దేశ వాసులను వెనక్కి రప్పించేందుకు మాత్రం ఖాళీ విమానాలను పంపిస్తామని స్పష్టం చేసింది. ఈజిప్టులో మొత్తం 40 వేలమంది రష్యన్లు ఉన్నట్లు సమాచారం. ముందస్తు భద్రతా దృష్ట్యానే సర్వీసులు రద్దు చేశాం తప్ప ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదని రష్యా స్పష్టం చేసింది.