వివక్షలో మనమే టాప్!!
జోర్డాన్ తర్వాత భారత్‌లోనే జాతి వివక్ష అధికం
- 43.5 శాతం మంది వేరే జాతి వారిని పొరుగు వారిగా సహించరు
- అభివృద్ధి చెందుతున్న దేశాల సమాజాల్లో జాతి వివక్ష అధికం
- అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో వివక్ష తక్కువ, సహనం ఎక్కువ
- ప్రపంచ వ్యాప్తంగా ‘వరల్డ్ వాల్యూ సర్వే’ అధ్యయనంలో వెల్లడి
► 6.20 కోట్ల మంది: జాతివివక్ష, వర్ణవివక్ష, జాతీయవాదం, సామ్రాజ్యవాదం, కుల వ్యవస్థల కారణంగా గత శతాబ్ద కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలు కోల్పాయిన మనుషుల సంఖ్య.
► 2.2 కోట్ల మంది: జాతి వివక్ష యుద్ధాలు, సంక్షోభాల కారణంగా ప్రాణభయంతో తమ ఇళ్లు వదిలి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శరణార్థులుగా బతుకీడుస్తున్న మనుషుల సంఖ్య.
‘మనిషి విలువ అతడి తక్షణ గుర్తింపుకు కుచించుకుపోయింది’ అని రోహిత్ వేముల తన ఆత్మహత్య లేఖలో ప్రకటించాడు. అవును.. మనుషులు సాటి మనిషిని మనిషిగా గుర్తించడం చాలా అరుదైన విషయం అయిపోయింది. తోటి మనిషి జాతి, కులం, మతం, ప్రాంతం, లింగం, వర్ణాలను బట్టి విలువ నిర్ణయం షరా మామూలు విషయమైపోయింది. ఒక జాతిని మరొక జాతి.. ఒక కులాన్ని వేరొక కులం.. ఒక తెగను ఇంకొక తెగ.. ఒక మతాన్ని మరొక మతం.. ద్వేషించే వివక్ష ఒక్క భారతదేశంలోనే కాదు.. ప్రపంచమంతా వర్ధిల్లుతోంది. కాకపోతే ఆ వివక్ష స్థాయిలో తేడాలున్నాయంతే. కానీ.. ప్రపంచ దేశాలన్నిటిలో మన దేశంలోనే ఈ వివక్ష అధికంగా ఉందని ఇటీవల అంతర్జాతీయంగా నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. మనకన్నా జోర్డాన్‌లో ఇంకొంచెం ఎక్కువగా వివక్ష రాజ్యమేలుతోంది. ‘మీ పొరుగింట్లో వేరే జాతి వారు ఉండటానికి ఇష్టపడతారా?’ అన్న ప్రశ్నతో నిర్వహించిన ఆ సర్వే వివరాలు సంక్షిప్తంగా...
అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే వేరే జాతుల వారి పట్ల అసహనం, జాతి వివక్షలు అత్యధికంగా ఉన్నాయని ప్రపంచ సామాజిక వైఖరుల అధ్యయనం చెప్తోంది. ఈ జాబితాలో అగ్రస్థానంలో జోర్డాన్ ఉంటే.. రెండో స్థానంలో ఇండియా ఉంది. జోర్డాన్‌లో 51.4 శాతం మంది వేరే జాతి ప్రజల పొరుగున నివసించడానికి విముఖత వ్యక్తంచేశారు. ఆ తర్వాత భారతదేశంలో 43.5 శాతం మంది వేరే జాతి వారిని తమ పొరుగు వారిగా అంగీకరించడానికి ఇష్టపడలేదు. అభివృద్ధి చెందిన దేశాలు, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఈ జాతి వివక్ష తక్కువగా ఉందని, వేరే జాతీయులను అంగీకరించే వైఖరి అక్కడ ఎక్కువగా ఉందని వెల్లడైంది.
ఇక.. వివక్షాపూరిత విధానాలతో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని అమెరికాలో.. వేరే జాతి వారిని తమ పొరుగు వారిగా అంగీకరించలేమన్న వారి సంఖ్య అత్యల్పంగా 3.8 శాతం మంది మాత్రమే ఉండటం విశేషం. అలాగే.. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రజల్లోనూ ఐదు శాతం కన్నా తక్కువ మంది ఇలాంటి వారు ఉన్నారు. అవి ఎక్కువ సహనశీల సమాజాలుగా తేలాయి. ‘వరల్డ్ వాల్యూ సర్వే’ పేరుతో మూడు దశాబ్దాల పాటు 80 దేశాల్లో ఈ అధ్యయనం నిర్వహించారు. అధ్యయనం వివరాలను 2013లో వెల్లడించగా.. దానిని 2016లో మళ్లీ తాజాపరిచారు.
వరల్డ్ వాల్యూ సర్వే అధ్యయనం ప్రకారం ఏఏ దేశాల్లో వివక్ష శాతం ఎలా ఉందో ఈ మ్యాప్ చెప్తోంది...
► 0% నుంచి 4.9% వరకూ: అమెరికా, కెనడా, బ్రెజిల్, అర్జెంటీనా, కొలంబియా, గ్వాటెమలా, బ్రిటన్, స్వీడన్, నార్వే, లాత్వియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్
► 5% నుంచి 9.9% వరకూ: చిలీ, పెరూ, మెక్సికో, స్పెయిన్, జర్మనీ, బెల్జియం, బెలారస్, క్రొయేషియా, జపాన్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా
► 10% నుంచి 14.9% వరకూ: ఫిన్లాండ్, పోలండ్, ఉక్రెయిన్, ఇటలీ, గ్రీస్, చెక్ రిపబ్లిక్, స్లొవేకియా
► 15% నుంచి 19.9% వరకూ: వెనిజువెలా, హంగరీ, సెర్బియా, రొమేనియా, మాసిడోనియా, ఇథియోపియా, ఉగాండా, టాంజానియా, రష్యా, చైనా
► 20% నుంచి 29.9% వరకూ: వరకూ: ఫ్రాన్స్ టర్కీ, బల్గేరియా, అల్జీరియా, మొరాకో, మాలి, జాంబియా, థాయ్‌లాండ్, మలేసియా, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, హాంగ్‌కాంగ్
► 30% నుంచి 39.9% వరకూ: ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఇరాన్, వియత్నాం, ఇండొనేసియా, దక్షిణ కొరియా
► 40% నుంచి ఆపైన: జోర్డాన్, ఇండియా
(మార్చి 21వ తేదీ.. ‘జాతి వివక్షను రూపుమాపడానికి అంతర్జాతీయ దినోత్సవం’ సందర్భంగా)
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)