
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. కోట్లాది మందిని పేదరికం కోరల నుంచి రక్షించిందంటూ ప్రశంసించారు. ఐరాస సర్వప్రతినిధి సభలో ప్రపంచనేతలనుద్దేశించి మంగళవారం ట్రంప్ 35 నిమిషాలపాటు మాట్లాడారు. ముందు తరాల వారికి ఎలాంటి ప్రపంచాన్ని ఇవ్వబోతున్నాం, ఎలాంటి దేశాల వారసత్వాన్ని వారు అందుకోబోతున్నారన్నదే అసలైన ప్రశ్న అని చెప్పారు.
‘విభిన్న దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులతో నిండిన ఈ సభా మందిరం వారి విభిన్నమైన కలలతో నిండి ఉంది. ఇక్కడ నిజంగా ఏదో ఉంది. ఇది నిజంగా చాలా గొప్ప చరిత్ర’ అని అన్నారు. ‘భారత్ స్వేచ్ఛా సమాజంలో 100 కోట్ల మందికిపైగా ప్రజలున్నారు. అక్కడి ప్రభుత్వం కోట్లాదిమంది ప్రజలను పేదరికం నుంచి మధ్యతరగతి స్థాయికి విజయవంతంగా తీసుకురాగలిగింది’ అని ప్రశంసించారు.