అమెరికాను వెనక్కి నెట్టిన ఇండియన్స్
వాషింగ్టన్: ఇంటర్నెట్ వినియోగంలో భారతీయులు దూసుకుపోతున్నారు. అగ్రరాజ్యం అమెరికాను వెనక్కునెట్టి రెండో స్థానానికి ఎగబాకారు. అత్యధిక మంది ఇంటర్నెట్ యూజర్లతో చైనా మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం 27.7 కోట్ల మంది భారతీయులు ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నట్టు పెట్టుబడి సంస్థ కేపీసీబీ భాగస్వామి మేరీ మీకర్ రూపొందించిన వార్షిక 'ఇంటర్నెట్ ట్రెండ్స్' నివేదిక వెల్లడించింది.
గత సంవత్సరంతో పోలిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 7 శాతమే పెరగగా.. భారత్‌లో 40 శాతం వృద్ధి చెందటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య పెరగడంలో ఒక్క భారతే 2 శాతం పాయింట్లను జతచేయడం గమనార్హం. వాస్తవానికి అమెరికాతో పోలిస్తే భారత్‌లో ఇంటర్నెట్ కు ఎక్కువ ఖర్చు అవుతుంది.
భవిష్యత్ లో నూతన వినియోగదారులు దొరికే పరిస్థితి లేకపోవటం వల్ల గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్ వంటి సంస్థలు భారతీయులపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయని 'ఇంటర్నెట్ ట్రెండ్స్' నివేదిక రూపకర్త మీకర్ తెలిపారు. అభివృద్ధి చెందుతున్న పేద దేశాల నుంచి ఇంటర్నెట్ వాడకం పెరుగుతోందని వెల్లడించారు.