మన ముస్లింలు జాతీయ వాదులు
లక్నో: భారతీయ ముస్లింలు జాతీయవాదులని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. ఉగ్రవాదానికి వారెన్నడూ మద్దతు పలకలేదన్నారు. ఇస్లామిక్ స్టేట్ వంటి మతచాంధస ఉగ్రవాద సంస్థలకు భారత్‌లో స్థానం కల్పించలేదన్నారు. ఉగ్రవాదాన్ని ఏదో ఒక మతంతో ముడిపెట్టడం సరికాదని స్పష్టం చేశారు. మదన మోహన్ మాలవీయ మిషన్ ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంతో పాటు పలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్న రాజ్‌నాథ్.. ఉగ్రవాద సవాలును ఎదుర్కొంటున్న దేశాలన్నీ కలిసికట్టుగా ఉగ్రవాదంపై పోరు సాగించాలన్నారు.
ఉగ్రవాద బాధిత దేశాల్లో ఒకటైన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో కలిసి రావాలన్నారు. టైస్టులకు టైస్టులతోనే సమాధానం చెప్పాలంటూ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యలపై పాక్ ఘాటుగా స్పందించిన నేపథ్యంలో.. ‘ఉగ్రవాదాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారో ఒక్క భారత్‌కే కాదు.. ప్రపంచమంతటికీ తెలుసంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. నకిలీ కరెన్సీ నోట్లు ఉగ్రవాద వ్యాప్తికి ఉపయోగపడ్తున్నాయని రాజ్‌నాథ్ ఆందోళన వ్యక్తంచేశారు.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత, ఆర్థిక వృద్ధికి తోడ్పడిన నిర్ణయాల్లో బ్యాంకుల జాతీయీకరణ అత్యంత ముఖ్యమైనదని ప్రశంసించారు. తమ ప్రభుత్వ ఆర్థికపరమైన నిర్ణయాల వల్ల త్వరలోనే రెండంకెల వృద్ధిరేటును అందుకోగలమన్న విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ మహా సంపర్క్ అభియాన్‌ను ప్రారంభిస్తూ.. తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు.
‘మోదీ ఏడాది పాలనపై చర్చ మనదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుతుదోంది. భారత్‌పై ప్రపంచ దేశాల దృక్పథం మారుతోందన్న విషయం విదేశీ పర్యటనల సందర్భంగా మోదీకి లభిస్తున్న స్వాగత సత్కారాల తీరును చూస్తే అర్థమవుతుంది. 2025 నాటికి భారత్ సూపర్ పవర్‌గా మారుతుంది’ అని అన్నారు.