
నౌకాదళంలోకి ‘ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య’
రష్యా తీరంలో జరిగిన కార్యక్రమంలో అప్పగింత
పాల్గొన్న రక్షణ మంత్రి ఎ.కె. ఆంటోనీ
సెవెరోడ్విన్‌స్క్ (రష్యా): ఐదేళ్ల జాప్యం అనంతరం రష్యా ఆధునీకరించిన విమానవాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య భారత నౌకాదళంలోకి చేరింది. రష్యాలోని సెవెరోడ్విన్‌స్క్‌లో ఉన్న ఉత్తర ఆర్కిటిక్ పోర్టు సెవ్‌మాష్ షిప్‌యార్డులో శనివారం జరిగిన అప్పగింత కార్యక్రమంలో ఈ విమానవాహక నౌకను రష్యా అధికారులు భారత్‌కు అప్పగించారు. భారత రక్షణ మంత్రి ఎ.కె. ఆంటోనీ, రష్యా ఉప ప్రధాని దిమిత్రీ రోగోజిన్, ఇరు దేశాల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంటోనీ మాట్లాడుతూ ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య చేరికతో భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలు గణనీయంగా పెరుగుతాయన్నారు. ఈ నౌక 2014 ఫిబ్రవరిలో భారత్ చేరుకోనుందని రష్యా అధికారులు పేర్కొన్నారు.
ప్రత్యేకతలు...
భారత నౌకాదళంలోకెల్లా అతిపెద్ద, అతిబరువైన నౌక. దీని పొడవు 284 మీటర్లు, ఎత్తు 60 మీటర్లు, బరువు 44,500 టన్నులు.
దీని కొనుగోలుకు భారత్ రూ. 1.44 లక్షల కోట్లు వెచ్చించింది.
ఇది ఏకకాలంలో 24 మిగ్-29 రకం యుద్ధ విమానాలు, 10 హెలికాప్టర్లను మోసుకెళ్లగలదు.
రోజూ 1,300 కి.మీ. దూరం సముద్రయానం చేయగలదు.
ఒకసారి ఇంధనం నింపితే 45 రోజులపాటు పనిచేస్తుంది.
నౌక కార్యకలాపాలను 1,600 మంది సిబ్బంది పర్యవేక్షిస్తారు.
ఇందులోని సిబ్బంది ఆహారం కోసం నెలకు 16 టన్నుల బియ్యం, 2 లక్షల లీటర్ల పాలు, లక్షకుపైగా గుడ్లు అవసరమవుతాయని అంచనా.
రష్యా నౌకాదళంలో సేవలు...
రష్యా 1987లో ఈ నౌకను ‘బకు’ పేరుతో తన నౌకాదళంలో ప్రవేశపెట్టి ఆపై దీనికి అడ్మిరల్ గోర్ష్‌కోవ్ అని నామకరణం చేసింది.
1996లో తన నౌకాదళ సేవల నుంచి తొలగించాక దీన్ని ఆధునీకరించి భారత్‌కు విక్రయించేందుకు ముందుకొచ్చింది.
దీని కొనుగోలుకు 2004లో భారత్-రష్యాల మధ్య సుమారు రూ. 60 వేల కోట్లకు ఒప్పందం కుదిరింది.
రష్యా 2008లోనే దీన్ని భారత్‌కు అప్పగించాల్సి ఉన్నా నిర్మాణ వ్యయం పెరిగిందంటూ ఆధునీకరణ పనులను ఆపేయడంతో భారత్ మరింత సొమ్ము వెచ్చించేందుకు అంగీకరిస్తూ మరో ఒప్పందం కుదుర్చుకుంది.