భారత మహిళ యూకేలో దారుణహత్య
లండన్: భారత సంతతికి చెందిన ఓ మహిళ యూకేలో దారుణహత్యకు గురైంది. కిరణ్ దాడియా(46) అనే మహిళను హత్యచేసి సూట్‌కేసులో మృతదేహాన్ని ఉంచి లీసెస్టర్ లోని క్రొమర్ స్ట్రీట్‌లో వదిలివెళ్లారు. సూట్‌కేసును గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. లీసెస్టర్‌షైర్ పోలీసులు అక్కడకి చేరుకుని సూట్‌కేసు తెరచిచూడగా రక్తపు మరకలతో ఉన్న కిరణ్ దాడియా మృతదేహాన్ని గుర్తించారు. భారత సంతతికి చెందిన ఈ మహిళ గత 17 ఏళ్ల నుంచి ఓ కాల్ సెంటర్లో జాబ్ చేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆఫీసుకు వెళ్లిన ఆమె కనిపించడం లేదని కిరణ్ సోదరి జస్బీర్ కౌర్ పోలీసులకు తెలిపారు. చివరగా జాబ్ వెళ్లే ముందు తన సోదరితో ఫోన్లో మాట్లాడినట్లు వివరించింది.
కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గురైన మహిళ భర్త అశ్విన్ దాడియా(50)ని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. అదే ఏరియాలో ఇటీవల తప్పిపోయిన బ్రిటన్ మహిళ మృతదేహమని మొదట తాము భావించామని స్థానికులు చెప్పారు. ఆధారాలను సేకరించిన క్లూస్ టీమ్ దర్యాప్తు జరుపుతోంది. కిరణ్ భర్త అశ్విన్‌ను కోర్టుకు తీసుకెళ్లనున్నట్లు పోలీసులు చెప్పారు. విచారణ ఇంకా కొనసాగుతోందని, త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
తన సోదరి మృతదేహాన్ని చూసిన తన పిల్లలు ఎంతో భయపడ్డారని, అందులోనూ ఇంటికి వచ్చి పోలీసులు విచారణ చేయడం ఇందుకు మరో కారణమని జస్బీర్ కౌర్ చెప్పారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారని, సీసీటీవీ ఫుటేజీని సేకరించిన పోలీసులు నిందితులను త్వరలోనే పట్టుకుని వారిని శిక్షించాలన్నారు. అమ్మ అందరితోనే కలిసిపోయే వ్యక్తి అని ఆమె హత్యకు గురయ్యారన్న నిజాన్ని నమ్మలేకపోతున్నామని కిరణ్ దాడియా ఇద్దరు కుమారులు పోలీసుల విచారణలో తెలిపారు.