భూగోళం మొత్తం ఇక గూగోళం!
మీకు తెలుసా? గాలి పీల్చడం, స్వేచ్ఛగా జీవించడం మాదిరిగానే ఇంటర్నెట్ సౌకర్యం మనిషి ప్రాథమిక హక్కు! ఐక్యరాజ్యసమితి స్వయంగా చెప్పిన విషయమిది. ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉంటే పేదరిక నిర్మూలనే కాదు, ఇంకా అనేక అద్భుతాలు సాధ్యమవుతాయి. కానీ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ భూమ్మీద చాలామందికి కనీసం మంచినీళ్లు కూడా కరవైనట్లు.. కోట్ల మంది ఇంటర్నెట్‌కూ దూరంగా ఉన్నారు. సరేగానీ.. దీనికీ.. పక్కనున్న ఫొటోలకూ సంబంధం ఏమిటి అంటున్నారా? భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరికి.. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో ఉన్నవారికి ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించేందుకు వన్‌వెబ్ అనే స్టార్టప్ కంపెనీ ఓ బృహత్తర ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది.
అమెజాన్ కంపెనీ అధినేతకు ‘బ్లూ ఆరిజన్’ పేరుతో ఓ రాకెట్ల తయారీ కంపెనీ ఉంది కదా, దాంట్లోంచి ఓ 720 ఉపగ్రహాలను ప్రయోగించి.. వాటి ద్వారా ప్రపంచమంతా నెట్ సౌకర్యం అందుబాటులోకి తేవాలన్నది వన్‌వెబ్ ప్లాన్! ఇందుకు బ్లూ ఆరిజన్ కూడా ఓకే అనడంతో ఇప్పుడు వన్‌వెబ్ గురించి చెప్పాల్సి వస్తోంది. భూమి చుట్టూ నిర్దిష్ట కక్ష్యలో తిరిగే 720 ఉపగ్రహాలు ఇంటర్నెట్ సమాచారాన్ని ప్రసారం చేస్తూంటాయి. రిసీవర్ల సాయంతో ఈ సమాచారాన్ని భూమ్మీద ఎక్కడి నుంచైనా పొందవచ్చు.
అయితే వన్ వెబ్ ముందుగా అమెరికన్ గ్రామాలతో మొదలుపెట్టి దశలవారీగా ప్రపంచమంతటీ విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇంకో ఐదేళ్లలో ప్రపంచంలోని అన్ని స్కూళ్లకూ నెట్‌ను అందజేస్తామంటున్న ‘వన్‌వెబ్’ వెనుక మహామహులే ఉన్నారు. వర్జిన్ ఎయిర్‌వేస్‌కు చెందిన రిచర్డ్ బ్రాన్నన్, విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్, మైక్రోప్రాసెసర్ తయారీ సంస్థ క్వాల్‌కామ్, ఎయిర్‌టెల్ వ్యవస్థాపకుడు భారతీ మిట్టల్ తదితరులందరూ బోర్డు సభ్యులుగా ఉన్న వన్‌వెబ్‌కు అమెరికాలోని ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ ఇప్పటికే అనుమతులు ఇచ్చేసింది.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్