అమెరికా, ఆస్ట్రేలియా సైట్‌లు హ్యాక్ చేసిన ఐఎస్
1,400 మంది ఉన్నతాధికారులను హతమారుస్తామని హెచ్చరిక
మెల్‌బోర్న్: ఇరాక్, సిరియాలో మారణహోమం సృష్టిస్తున్న ఐఎస్ తీవ్రవాదులు కన్ను అమెరికా, ఆస్ట్రేలియాపై పడింది. ఈ దేశాల్లోని రక్షణ రంగం, ప్రభుత్వ విభాగాల్లోని 1,400 మంది ముఖ్యుల వివరాలను హ్యాక్ చేసినట్లు వెల్లడించింది. త్వరలో వీరంద రనీ హతమారుస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక తెలిపింది. ఇందులో అమెరికాకు చెందిన వారే ఎక్కువ ఉన్నారని వెల్లడించింది.
‘మేం మీ కదలికలన్నీ గమనిస్తున్నాం. మీరు వాడుతున్న సామాజిక మాధ్యమాల్లో మా సభ్యులున్నారు. మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించాం. ఇందులో మీ బందువులు కూడా ఉన్నారు. త్వరలో మా ఐఎస్ మిత్రులు మిమల్ని మీ దేశంలోనే మట్టుపెడతారు’ అని ఇస్లామిక్ స్టేట్ హ్యాకింగ్ విభాగం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో విక్టోరియా ఎంపీ కూడా ఉన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు చేరవేశానని ఎంపీ తెలిపారు. తమ కుటుంబ సభ్యులకు పూర్తి రక్షణ కల్పించాలని కోరినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ విభాగం అంగీకరించింది. ఉద్యోగుల వివరాలను ఫోన్ నంబర్లు, చిరునామాలతో సహా ఐఎస్ బుధవారం ఆన్‌లైన్‌లో పెట్టినట్లు తెలిపింది.