వాట్సప్, టెలిగ్రాంలలో.. అమ్మాయిల అమ్మకం!
టెలిగ్రామ్ యాప్లో ఈ మధ్య ఓ ప్రకటన వస్తోంది.. ‘‘అమ్మకానికి అమ్మాయి ఉంది.. కన్నెపిల్ల.. అందంగా ఉంటుంది.. 12 ఏళ్ల వయసు.. ఆమె ధర ఇప్పటికి రూ. 8.5 లక్షల వరకు వెళ్లింది.. త్వరలోనే అమ్ముడుపోతుంది.. తొందరపడండి’’ అంటూ అరబిక్ భాషలో ఈ ప్రకటన ఉంది. పిల్లిపిల్లలు, ఆయుధాల ప్రకటనలతో పాటే ఈ ప్రకటన కూడా వచ్చింది. మైనారిటీ యజీదీ వర్గం వాళ్ల హక్కుల కోసం పోరాడుతున్న ఓ కార్యకర్త ఈ ప్రకటనను మీడియాకు పంపారు. యజీదీ మహిళలను, పిల్లలను ఉగ్రవాదులు బంధించి, వాళ్లను సెక్స్ బానిసలుగా అమ్మేస్తున్నారు. ఇప్పటివరకు ఇలా దాదాపు 3వేల మంది మహిళలు, బాలికలను అమ్మేసినట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు స్మార్ట్ఫోన్లలోని వాట్సాప్, టెలిగ్రాం లాంటి యాప్ల సాయంతో మహిళలను, పిల్లలను ఇలా అమ్మకానికి పెడుతున్నారు. వాళ్ల ఫొటోలతో పాటు.. వాళ్ల ‘యజమానుల’ వివరాలు కూడా పెడుతున్నారు. ఎక్కడికక్కడ తమ సొంత చెక్పోస్టులు పెట్టి, వాటి నుంచి మహిళలు తప్పించుకోకుండా చూస్తున్నారు. బందీలుగా ఉన్న మహిళలను తప్పించేందుకు కొందరు స్మగ్లర్లు ప్రయత్నించగా, వాళ్లను నిర్దాక్షిణ్యంగా చంపేశారు.
2014 ఆగస్టు నెలలో వందలాది మంది యజీదీ మహిళలు, పిల్లలను బందీలుగా చేసుకున్న ఐఎస్ ఉగ్రవాదులు కుర్దిష్ భాష మాట్లాడే మైనారిటీ వర్గం మొత్తాన్ని నిర్మూలించాలన్న ఆలోచనలో ఉన్నారు. కొన్నాళ్ల పాటు అరబ్, కుర్దిష్ స్మగ్లర్లు మాత్రం ఎలాగోలా ప్రాణాలకు తెగించి నెలకు దాదాపు 134 మంది మహిళలను విడిపించారు. కానీ మే నెలలో ఐఎస్ ఉగ్రవాదులు వాళ్ల మీద విరుచుకుపడటంతో.. గత ఆరు వారాల్లో కేవలం 39 మందిని మాత్రమే విడిపించగలిగారు. ఎవరైనా పారిపోయే ప్రయత్నం చేసినా.. చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో మందుపాతరలను ఏర్పాటుచేయడంతో వాళ్లలో చాలామంది చనిపోతున్నారు. వాటి బారి నుంచి అతి కొద్ది మంది మాత్రం ఎలాగోలా తప్పించుకుని.. బయట పడుతున్నారు.