
ఇవాంచోకే అవకాశం!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమంలో జాతీయ గీతం పాడేందుకు జాకీ ఇవాంచోకే అవకాశం దక్కింది. ఈ పదహారేళ్ల టీనేజ్ క్లాసికల్ సింగర్ అమెరికన్లకు కొత్తేం కాదు. గతంలో ఒబామా పాల్గొన్న పలు కార్యక్రమాల్లో జాతీయగీతం పాడింది ఇవాంచోనే. అధ్యక్షుడు మారినా ఆ అవకాశం మాత్రం మళ్లీ ఇవాంచోకే దక్కింది. 2010లో క్రిస్మస్ వేడుకలలో ప్రదర్శణ ద్వారా ఇవాంచో తొలిసారి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత అమెరికాలో జరిగిన చాలా ఈవెంట్లలో ఆమె పాటలు పాడి దేశ ప్రజల ప్రశంసలు పొందింది.
ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్లలో ‘ గాడ్ బ్లెస్ అమెరికా’ ని ఆలపించింది. 10 ఏళ్ల వయసులో యూట్యూబ్ సంచలనంగా మారిన ఇవాంచో ‘ అమెరికా గాట్ టాలెంట్’ గా ఎంపికైంది. అప్పటినుంచీ అమెరికా ప్రభుత్వ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొంది. ప్రస్తుతం ఆమె ఎంపికపై మాట్లాడుతూ.. ‘ నాకు ఈ అవకాశం రావడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. గతంలో ఒబామా ప్రభుత్వంలో ఈవెంట్స్ చేశాను. ఇప్పుడు ట్రంప్ సమక్షంలో ప్రదర్శన ఇవ్వబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది’ అని టీనేజ్ సింగర్ జాకీ ఇవాంచో చెప్పింది.