
జెట్ సైకిల్...
సైకిల్‌పై మీరెంత వేగంగా వెళ్లగలరు? బలమంతా ఉపయోగించినా గంటకు 40 కిలోమీటర్లు దాటడం కష్టమే. కానీ ఈ ఫొటోలో కనిపిస్తోందే... ఇది గంటకు 135 కిలోమీటర్ల వేగంతో వెళ్లి రికార్డులు బద్ధలు కొట్టింది. ఏంటి... ఇది కూడా సైకిలేనా? ఆశ్చర్య పోతున్నారా!. అవును. సైకిలే. ‘ఏరోవేలో’ అనే కంపెనీ తయారు చేసింది దీన్ని. పేరు ‘ఈటా’. దీని ప్రత్యేక ఆకారం కారణంగా గాలి నిరోధం వంద రెట్లు (కారుతో పోలిస్తే) తగ్గిపోతుంది. ఫలితంగా ఒక్క తొక్కు తొక్కితే చాలు.... బోలెడంత దూరం వెళ్లిపోవచ్చు. సాధారణ సైకిళ్ల మాదిరి ఈటాలో కూర్చుని తొక్కడం వీలుపడదు. వీలైనంత వరకూ వెనక్కు వాలి అంటే దాదాపుగా పడుకున్నట్టుగా ఉంటూ పెడల్స్ తొక్కాల్సి ఉంటుంది.
దీనివల్ల శరీర బరువు వాహనం మొత్తానికి విస్తరిస్తుందన్నమాట. ఇటీవల నెవడాలోని బ్లూమౌంటెయిన్ ప్రాంతంలో జరిగిన ఒక పోటీలో టాడ్ రీచెర్ట్ అనే వ్యక్తి ఈటాను 144 కిలోమీటర్ల వేగంతో నడిపించాడు. ఈ పోటీలో ఎనిమిది కిలోమీటర్ల దూరాన్ని అతితక్కువ సమయంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ట్రాక్‌లో మొదటి రెండు వందల మీటర్ల దూరం కొద్దిగా వాలుగా ఉన్నప్పటికీ ఆ తరువాత ఎక్కడా హెచ్చుతగ్గులన్నది లేకుండా బల్లపరుపుగా ఉంటుంది. పోటీ సుమారు ఐదు రోజులపాటు జరిగితే ఈటా తొలిరోజున గంటకు 141 కిలోమీటర్ల్ల వేగం మాత్రమే అందుకోగలిగింది, ఆ తరువాతి రోజు వర్షంతో పోటీలే రద్దు కాగా మూడోరోజూ ఆశించిన ఫలితం రాలేదు. నాలుగో రోజు ఈటాను ఓ కీటకం ఢీకొట్టడంతో సమస్య ఎదురైంది. చివరకు పోటీల చివరి రోజు ఈటా 144 కిలోమీటర్ల రికార్డు సృష్టించగలిగింది.