
లైంగిక చర్య ద్వారానూ జికా వైరస్
అమెరికాలోని టెక్సాస్‌లో నమోదైన తొలి కేసు
మియామి: అధిక ఉష్ణోగ్రతలు ఉన్న చోట జికా వైరస్ అధికంగా వ్యాప్తి చెందుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా ఇప్పుడే చెప్పడం తొందరపాటే అయినప్పటికీ చాలా సందర్భాల్లో వైరస్‌ల వ్యాప్తిలో వాతావరణం కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు. అధిక ఉష్ణోగ్రతతో దోమ మరిన్ని దోమల్ని ఉత్పత్తి చేస్తుందని వారు చెబుతున్నారు.
గర్భిణుల పాలిట శాపంగా..
జికా వైరస్ గర్భిణుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. ఈ వైరస్ గర్భిణుల నుంచి పిల్లలకు సోకి ఆందోళన కలిగిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ వైరస్‌తో సంభవించే మైక్రోసెఫలీ అనే వ్యాధి పుట్టబోయే పిల్లల మెదడు ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జికా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించవద్దని గర్భిణులకు డబ్ల్యూహెచ్‌వో సూచిస్తోంది.
లైంగిక చర్య ద్వారా కూడా...
ప్రపంచ దేశాలను వణికిస్తున్న జికా వైరస్ లైంగిక చర్య ద్వారా కూడా వ్యాప్తి చెందుతోంది. టెక్సాస్‌లో ఈ విధంగా జికా సోకిన తొలి కేసు నమోదైంది. ఈ మేరకు అమెరికా ఆరోగ్య విభాగ వర్గాలు ధ్రువీకరించాయి. ఇప్పటివరకూ ఈ వైరస్ దోమల ద్వారానే సోకుతుందని భావించారు. తాజాగా వైరస్ సోకిన వారితో లైంగిక చర్య ద్వారా కూడా సోకుతుందని తేలింది. ఈ మేరకు అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డెరైక్టర్ డాక్టర్ టామ్ ఫ్రీడెన్ ఓ ఈ మెయిల్‌లో స్పష్టం చేశారు.
జికా డివైస్‌తో రక్షణ
దోమల నుంచి వ్యాపిస్తోన్న జికా వైరస్ నుంచి ఓ డివైస్ రక్షణ క ల్పిస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. జికాతో పాటు చికున్ గున్యా, డెంగీ, యెల్లో ఫీవర్‌లకు కారణమైన దోమల నుంచి రక్షించుకునేందుకు ఈ డివైస్ ఉపయోగపడుతుందని మెడికల్ ఎంటమాలజీ జర్నల్‌లో పేర్కొన్నారు.