కశ్మీర్...మా జీవనాడి
- పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్య
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కశ్మీర్‌ను తమ దేశ జీవనాడిగా అభివర్ణించారు. ఏటా ఈనెల 5న ఆనవాయితీగా నిర్వహించే కశ్మీర్ సంఘీభావ దినాన్ని పురస్కరించుకొని ముజఫరాబాద్‌లోని పాక్ ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీ సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగించారు. కశ్మీర్‌తో తనకు బాల్యం నుంచి అనుబంధం ఉందన్నారు.
కశ్మీర్...పాక్ జీవనాడి అని, అందువల్ల కశ్మీరీల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామన్నా రు. కశ్మీర్‌పై సరైన తీర్మానం ద్వారానే దక్షిణాసియాలో శాంతి సాధ్యమన్నారు. 150 కోట్ల మందికిపైగా ఉన్న ప్రజల భవిష్యత్తు కశ్మీర్ అంశంతో ముడిపడి ఉందని షరీఫ్ చెప్పారు. కశ్మీరీలకు స్వీయనిర్ణయాధికార హక్కు కల్పించడమే ఈ సమస్యకు పరిష్కారమన్నారు. కాగా, కశ్మీర్‌ను పాక్ జీవనాడిగా షరీఫ్ అభివర్ణించడంపై భారత్ విరుచుకుపడింది. ఎన్నటికీ దక్కదని తెలిసినా తమది కాని దాన్ని(కశ్మీర్) కోరుకోవడాన్ని పాక్ ఆపాలని హితవు పలికింది.