వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశం హోదాను భారత్ పొందాలంటే వీటో (ఏదేనీ శాసనాన్ని తిరస్కరించడానికి గల అధికారం) అంశాన్ని ప్రస్తావించకపోవడమే మార్గమని భారత సంతతి మహిళ, ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ అన్నారు. ప్రస్తుతం ఐరాసలో శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూకే, చైనాలకు వీటో అధికారాలున్నాయి. ఈ అధికారాన్ని ఆయా దేశాలు ఇతరులతో పంచుకునేందుకు కానీ, పూర్తిగా విడిచిపెట్టేందుకు కానీ సిద్ధంగా లేవని నిక్కీ హేలీ అన్నారు.
కాబట్టి వీటో అధికారాల గురించి ప్రస్తావించకపోతే భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశం హోదా లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. భద్రతా మండలిలో సంస్కరణలు రావాలని అమెరికా కోరుకుంటోందనీ, అయితే రష్యా, చైనాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని నిక్కీ హేలీ పేర్కొన్నారు. ‘అంతర్జాతీయ అంశాలపై భారత్–అమెరికా సహకారం పెంపొందించుకోవడంలో కాంగ్రెస్ పాత్ర’ అనే విషయంపై ఓ సంస్థ నిర్వహించిన సమావేశంలో నిక్కీ హేలీ ప్రసంగించారు. భద్రతా మండలి సంస్కరణల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ పాత్ర ఉండదనీ, మండలిలోని సభ్య దేశాలు తమ మాట వినే స్థితిలో లేవన్నారు. సభ్యత్వం పొందేందుకు భారత్ వీలైనన్ని ఎక్కువ దేశాల మద్దతు కూడగట్టుకోవాలని సూచించారు.
పాక్‌పై నిఘాకు భారత్ సాయపడగలదు
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై కఠిన వైఖరిని అవలంబించాలని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్న నేపథ్యంలో ఆ దేశంపై ఓ కన్నేసి ఉంచేందుకు భారత్ తమకు సహకరించగలదని నిక్కీ హేలీ అన్నారు. అఫ్గానిస్తాన్, దక్షిణాసియా ప్రాంతంలో ఉగ్రవాదంపై పోరుకు ట్రంప్ ఇటీవల కొత్త వ్యూహాన్ని ప్రకటించిన అంశాన్ని ప్రస్తావించిన ఆమె...ఆ వ్యూహంలో ఒక భాగం భారత్‌తో తమ భాగస్వామ్యాన్ని పెంచుకోవడమేనని చెప్పారు. కాగా, భారత నౌకాదళం విమాన వాహకాలను తయారుచేసేందుకు అవసరమైన ఎమల్స్ (ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ లాంచ్ సిస్టం) టెక్నాలజీని భారత్‌కు అందించనున్నట్లు ట్రంప్ యంత్రాంగం చెప్పింది.
దీపావళి వేడుకల్లో ట్రంప్
శ్వేతసౌధంలో దీపావళి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కూతురు ఇవాంకా ట్రంప్ పాల్గొన్నారు. ట్రంప్ అధ్యక్షుడైన తరువాత తొలిసారి జరిగిన ఈ వేడుకల్లో ఆయన పాలనా బృందంలోని ఇండో–అమెరికన్లయిన ఐరాసలో యూఎస్ రాయబారి నిక్కీ హేలీ, మెడికేర్, మెడిక్ ఎయిడ్ సర్వీసెస్ పాలనాధికారి సీమా వర్మ, యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ చైర్మన్ అజిత్ పాయ్ తదితరులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమెరికాలో పలు రంగాల్లో ఇండో–అమెరికన్ల సేవలను ట్రంప్ కొనియాడారు. భారత ప్రధాని మోదీతో తనకున్న అనుబంధానికి ఎంతో విలువ ఇస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment