అమెరికాతో సమఉజ్జీ | Kim Jong Un promises to complete North Korea's nuclear program | Sakshi
Sakshi News home page

అమెరికాతో సమఉజ్జీ

Published Sun, Sep 17 2017 1:13 AM | Last Updated on Tue, Sep 19 2017 4:39 PM

అమెరికాతో సమఉజ్జీ

అమెరికాతో సమఉజ్జీ

అదే మా లక్ష్యం
అణు కార్యక్రమం పూర్తి చేస్తా..
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ ప్రతిజ్ఞ


సియోల్‌:  సైనిక సంపత్తి విషయంలో అమెరి కాతో సమ ఉజ్జీ కావాలనే లక్ష్యానికి తమ దేశం చేరువగా వచ్చిందని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రకటించారు. ఎన్ని ఆంక్షలు విధించినా వెనక్కి తగ్గేది లేదని, అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తి చేసి తీరుతానని కిమ్‌ ప్రతిజ్ఞ చేశారు. ఉత్తరకొరియా అధికారిక మీడి యా కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ (కేసీఎన్‌ఏ) కిమ్‌ వ్యాఖ్యలను శనివారం ప్రసా రం చేసింది.

తాజా క్షిపణి ప్రయోగంపై కిమ్‌ పూర్తి సంతృప్తి వ్యక్తంచేసినట్టు కేసీఎన్‌ఏ తెలిపింది. క్షిపణి సామర్థ్యాన్ని కిమ్‌ స్వయంగా పరిశీలించినట్టు తెలిపింది. ఈ ప్రయోగం విజయవంతం కావడం దేశ సైనిక సంపత్తిని పెంపొందించిందని కిమ్‌ వ్యాఖ్యానించినట్టు పేర్కొంది. ఈ మిస్సైల్‌ వాడేందుకు సిద్ధంగా ఉందని కిమ్‌ చెప్పారు. అంతర్జాతీయంగా ఆంక్షలు విధిస్తున్నా అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.

అమెరికా వెనకడుగు వేసేలా ప్రతిదాడి చేసేందుకు అణు సామర్థ్యా న్ని సాధించామని, సైనిక సంపత్తిలో అమెరికాకు సమానంగా నిలవాలనేదే తమ లక్ష్యమని, తాజా పరీక్షలతో ఉత్తరకొరియా విషయంలో అమెరికా పాలకులు సైనికచర్య(మిలిటరీ ఆపరేషన్‌) అనే మాట మాట్లాడేందుకు ధైర్యం చేయరని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని క్షిపణి ప్రయోగాలు చేస్తామని కిమ్‌ సంకేతాలిచ్చారు.

భవిష్యత్తులో చేసే ప్రయోగాలు అర్థవంతంగా, వాస్తవికంగా ఉంటాయని, ఇది దేశ సైనిక సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని వెల్లడించారు. కాగా, శుక్రవారం తాము ప్రయోగించింది మధ్య తరహాకు చెందిన ఖండాంతర క్షిపణి హ్వాసంగ్‌–12 అని ఉత్తరకొరియా శనివారం నిర్ధారించింది. ఈ క్షిపణి జపాన్‌ మీదుగా 3,700 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పసిఫిక్‌ మహాసముద్రంలో కుప్పకూలింది. ఉత్తరకొరియా ఇప్పటి వరకూ చేసిన ప్రయోగంలో సుదూర ప్రాంతం ప్రయాణిం చిన క్షిపణి ఇదే.

ప్రాంతీయ శాంతికి విఘాతం..
జపాన్‌ మీదుగా ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం చేయడాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది. ఇది తీవ్రమైన రెచ్చగొట్టే చర్యని తప్పుబట్టింది. ఉత్తర కొరియా అణు, క్షిపణి ప్రయోగాల కారణంగా ప్రాంతీయ శాంతి, భద్రతకు విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా భద్రతాపరమైన ఆందోళనలకు కారణమవుతోందని పేర్కొంది. భద్రతా మండలి అత్యవసర భేటీ అనంతరం విడుదల చేసిన ప్రకటనలో ఉత్తరకొరియాపై విధించిన ఆంక్షలను అన్ని దేశాలు తక్షణం, పూర్తిగా అమలు చేయాలని సభ్య దేశాలకు సూచించింది.

అమెరికా భయపడదు
‘ఉ.కొరియా ముప్పు’పై ట్రంప్‌
వాషింగ్టన్‌: అమెరికా, తన మిత్ర దేశాలను ఎవరూ భయపెట్టలేరని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పునరుద్ఘాటించారు. ఉత్తర కొరియా ముప్పు ఎదుర్కొనేందుకు అమెరికా వద్ద ప్రభావశీల ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని చెప్పారు. అంతర్జాతీయ సమాజం ఆందోళనలను పెడచెవినపెడుతూ ఉ.కొరియా తాజాగా మరోసారి ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన నేపథ్యంలో ట్రంప్‌ పైవిధంగా వ్యాఖ్యానించారు.

ఉ.కొరియాను దీటుగా ఎదుర్కోవడానికి సైనిక చర్యకు దిగే అవకాశాలను పరిశీలిస్తున్నామని అమెరికా రక్షణ శాఖ సలహాదారు హెచ్‌ఆర్‌ మెక్‌మాస్టర్‌ వెల్లడించారు. అమెరికా వైమానిక దళ 70వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ట్రంప్‌ మాట్లాడుతూ..‘ మీ శక్తి, సామర్థ్యాలను చూసిన తరువాత నా విశ్వాసం ఎప్పుడూ లేనంతగా పెరిగింది. ఉ.కొరియా ముప్పు ఎదుర్కొనేందుకు మనకు ప్రభావశీల, మెరుగైన మార్గాలున్నాయన్న సంగతి అర్థమవుతోంది. బెదిరింపులకు దిగేవారి నుంచి మన ప్రజలు, మిత్రులు, మన సంస్కృతిని కాపాడుకోగలం’ అని అన్నారు. అమెరికా రక్షణ శాఖ మంత్రి మ్యాటిస్‌ ఉ.కొరియా క్షిపణి ప్రయోగంపై జపాన్‌ రక్షణ మంత్రి ఒనోడెరాతో ఫోన్‌లో మాట్లాడారు.   

ఉ.కొరియా ఆయుధ సంపత్తి
సాయుధ సిబ్బంది వాహకాలు         2,500
యుద్ధ ట్యాంకులు                         4,060
ఆర్టిల్లరీ, ఎయిర్‌ డిఫెన్స్‌ గన్స్‌         32,100
సైన్యం                                10, 20,000
యుద్ధ విమానాలు                           545
హెలికాప్టర్లు                                   286
ప్రధాన యుద్ధ నౌకలు                          3
తీరప్రాంత గస్తీ నౌకలు                      383
ల్యాండిగ్‌క్రాఫ్ట్‌+హోవర్‌ క్రాఫ్ట్‌                267
జలాంతర్గాములు                             70.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement