టీవీ నటికి తుపాకీతో బెదిరింపులు
పారిస్: హాలీవుడ్ రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. పారిస్ హోటల్ లో బస చేసిన ఆమెను ఆదివారం ఇద్దరు దుండగులు తుపాకీతో బెదిరించారు. పోలీసులు దుస్తులు ధరించి, ముసుగడు వేసుకుని వచ్చిన దుండగులు హోటల్ లోకి చొరబడ్డారని సీఎన్ఎన్ తెలిపింది. ఈ ఘటన జరిగినట్టు కిమ్ కర్దాషియన్ తరపు ప్రతినిధి ఇనా ట్రెకియోకాస్ ధ్రువీకరించారు. దుండగులు తుపాకీతో బెదిరించడంతో ఆమె వణికిపోయిందని వెల్లడించారు. అయితే ఆమెకు ఎటువంటి హాని చేయలేదని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కిమ్ కర్దాషియన్ నుంచి ఏమైనా దోచుకెళ్లారా, లేదా అనేది వెల్లడి కాలేదు. ఫ్యాషన్ వీక్ లో పాల్గొనేందుకు బుధవారం నుంచి ఆమె పారిస్ లో బస చేశారు. తన భార్యను దుండగులు బెదిరించారన్న వార్త తెలియగానే న్యూయార్క్ సిటీఫీల్డ్ లో మ్యూజిక్ అండ్ ఆర్ట్ ఫెస్టివల్ లో పాల్గొన్న కిమ్ కర్దాషియన్ భర్త కాన్ యె వెస్ట్ తన ప్రదర్శనను మధ్యలోనే ఆపేశారు. కుటుంబ సమస్య కారణంగా ప్రదర్శన నిలిపివేస్తున్నట్టు తెలిపారు.