
అభిమాన రోబోగణం..
అన్నిట్లోనూ రోబోలు వచ్చేస్తున్నాయి. చివరికి అభిమానుల ప్లేసునూ ఇవి ఆక్రమించేస్తున్నాయి. అందుకు నిదర్శనమే ఈ చిత్రం. ఇవి ఫాన్‌బోట్స్. ఈ రోబోలు దక్షిణ కొరియాకు చెందిన బేస్‌బాల్ టీం హన్వా ఈగల్స్ అభిమానులు! రోబో ఫాన్స్ పెట్టారంటే.. ఇదేదో పెద్ద టీం అనుకునేరు.. పేరుకు తగ్గట్లే.. ఈ టీం పని ‘ఈగల్స్’ తోలుకోవ డమే! చిన్నాచితకా మ్యాచ్‌లు కలిపి హన్వా ఈగల్స్ గత ఐదేళ్లలో 400 మ్యాచ్‌లు ఓడిపోయింది. దీనికితోడు ఈ టీం సభ్యులను ప్రోత్సహించడానికి వచ్చే అభిమానులు ఎప్పుడూ అవమానాలను ఎదుర్కొంటారట. వేరే టీంల అభిమానులు వీరిని తెగ ఏడిపిస్తారట. దీంతో చాలా మంది రావడం మానుకున్నారు. ఇంట్లోనే మ్యాచ్‌లు చూడ్డం మొదలెట్టారు.
అసలే టీం ఆట అంతంతమాత్రం.. ఇక అభిమానుల ప్రోత్సాహం కూడా కరువైతే.. ఇంకేమైనా ఉందా.. అందుకే హన్వా ఈగల్స్ యాజమాన్యం రోబోలను దింపింది. చీర్‌లీడర్స్‌లాగా ఇవి తమ టీంను ప్రోత్సహిస్తూ.. ఉత్సాహపరుస్తాయి. అంతేకాదు.. మ్యాచ్‌కు రాని అభిమానులు ఆన్‌లైన్ ద్వారా వీటిని కంట్రోల్ చేస్తూ.. స్టేడియంలో ఉన్న తమ టీంకు మద్దతిచ్చే సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. రోబోల ముఖాల స్థానంలో ఉన్న స్క్రీన్స్‌పై సదరు అభిమాని ఫొటో ప్రదర్శితమయ్యే సదుపాయాన్నీ కల్పించారు. అంటే.. మనం రోబో రూపంలోకి వెళ్లి.. పరోక్షంగా మన టీంను ఉత్సాహపరచవచ్చన్నమాట.