ఆమ్నెస్టీ  పీఠంపై కుమీ నాయుడు | Kumi Naidoo appointed as a Secretary General of Amnesty International | Sakshi
Sakshi News home page

ఆమ్నెస్టీ  పీఠంపై కుమీ నాయుడు

Published Fri, Dec 22 2017 7:58 PM | Last Updated on Fri, Dec 22 2017 7:58 PM

Kumi Naidoo appointed as a Secretary General of Amnesty International - Sakshi

ప్రసిద్ధ అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ  ఇంటర్నేషనల్‌ ప్రధాన కార్యదర్శిగా భారత తెలుగు మూలాలున్న దక్షిణాఫ్రికా ఉద్యమకారుడు కుమీ నాయుడు ఎంపికయ్యారు.  ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న బెంగళూరుకు చెందిన సలీల్‌షెట్టి 2018 ఆగస్ట్‌లో రిటైరయ్యాక నాయుడు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. లండన్‌కేంద్రస్థానంగా పనిచేసే ఆమ్నెస్టీ  అత్యున్నత పదవిలో సలీల్‌2010 నుంచి కొనసాగుతున్నారు. 52 ఏళ్ల నాయుడు ఇంతకు ముందు గ్రీన్‌పీస్‌ఇంటర్నేషన్‌ఎగ్జిక్యూటివ్‌డైరెక్టర్‌గా 2009 నుంచి 2015 వరకూ పనిచేశారు. ఆయన ఈ ఆమ్నెస్టీ  సెక్రెటరీ జనరల్‌గా మొదట నాలుగేళ్లు ఉంటారు. మరో నాలుగేళ్లు పొడిగించే అవకాశముంది. డర్బన్‌నగరంలో  దిగువ మధ్య తరగతి భారత సంతతి కుటుంబంలో జన్మించిన నాయుడు 15 ఏళ్ల వయసులోనే తల్లిని పోగొట్టుకున్నారు. తండ్రితో గొడవపడిన తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.  

శ్వేత దురహంకార సర్కారు పాలనతో సరైన ఆదరణ, కనీస సౌకర్యాలు లేక స్థానిక నల్లజాతివారు, భారత్‌నుంచి వచ్చి స్థిరపడిన కుటుంబాల్లో ఆత్మహత్యలు ఎక్కువ జరిగేవని నాయుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తెలుగు మూలాలున్న తల్లిదండ్రులకు పుట్టినా మిగిలిన భారత సంతతి జనం మాదిరిగానే నాయడు కూడా తనను నల్లజాతి దక్షిణాఫ్రికా పౌరునిగానే భావించి, తెల్లజాతి పాలకులపై పోరు సాగించారు. చదువుకునే రోజుల్లో అక్కడి ఎమర్జెన్సీ నిబంధనలు ఉల్లంఘించారనే సాకుతో నాయడును అనేక సార్లు అరెస్ట్‌చేశారు. పదిహేనేళ్ల వయసులో ఆయనను స్కూలు నుంచి బహిష్కరించాక కూడా ఇంట్లో చదువుకున్నారు. తర్వాత యూనివర్సిటీ లా డిగ్రీ సాధించారు. 1987లో దేశంలో తనకు భద్రత లేదని గ్రహించి ఆయన  ఇంగ్లండ్‌వెళ్లి ఆక్స్‌ఫర్డ్‌యూనివర్సిటీలో చేరారు.

మండేలా విడుదలతో ఆఫ్రికాలో ఆక్షరాస్యతా ఉద్యమం
వర్ణవివక్ష వ్యతిరేక విప్లవపోరాట యోధుడు నెల్సన్‌మండేలా 1990లో విడుదలయ్యాక  నాయుడు ఆక్స్‌ఫర్డ్‌చదువును మధ్యలో ఆపేసి దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడ నల్లజాతివారి పిల్లలకు, పెద్దలకు చదువు నేర్పే ఉద్యమంలో పనిచేశారు. ఓటర్లలో చైతన్యం నింపే కార్యక్రమాలు రూపొందించి అమలు చేశారు. బానిస సంకెళ్లు తెంచుకున్న మాతృదేశంలో చేయాల్సింది చాలా ఉన్నా ఆక్స్‌ఫర్డ్‌లో డాక్టరేట్‌పూర్తిచేయడానికి మళ్లీ లండన్‌వెళ్లారు. తన డాక్టరేట్‌పూర్తయితే ఆక్స్‌ఫర్డ్‌యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ తీసుకునే మొదటి దక్షిణాఫ్రికా భారతీయుడినయ్యే అవకాశం పొందడానికే వెళ్లానని తర్వాత ఆయన వివరించారు.

మళ్లీ దక్షిణాఫ్రికాకు చేరుకుని ప్రపంచవ్యాప్తంగా పౌరసమాజం, పౌరుల స్వయం కృషిని బలోపేతం చేసే లక్ష్యంతో ఆయన సివికస్‌అనే ఎన్జీఓను స్థాపించి దాని లక్ష్య సాధనకు బాగా పనిచేశారు. మొత్తంమీద ప్రపంచవ్యాప్తంగా మానవహక్కులు, పౌరసమాజం కోసం చేసిన విశేష కృషిని గుర్తించి ఆమ్నెస్టీ ఇంటర్నేషన్‌బోర్డు ఆయనను సెక్రెటరీ జనరల్‌పదవికి ఎంపికచేసింది. లండన్‌లోని ఈ సంస్థ ప్రధాన ప్రతినిధిగా, సెక్రెటేరియట్‌చీఫ్‌ఎగ్జిక్యూటివ్‌గా సెక్రెటరీ జనరల్‌పనిచేస్తారు. ఆమ్నెస్టీ  ప్రపంచంలోనే అతిపెద్ద మానవహక్కుల పరిరక్షణ సంస్థ. 70 దేశాల్లో 2600 మంది సిబ్బందితో దీని కార్యాలయాలు పనిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది సభ్యులు, వలంటీర్లు, మద్దతుదార్లు ఉన్నారు. 

కుమీ నాయుడు తెలుగు మూలాలు
1860 నుంచి 1911 వరకూ అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తమిళులతోపాటు తెలుగువారువ్యవసాయ సామాజికవర్గాలైన రెడ్లు, కాపు బలిజలు పెద్ద సంఖ్యలో వ్యవసాయం చేయడానికి, కింది కులాలకు చెందిన పేదలు పనిచేయడానికి దక్షిణాఫ్రికాకు వలసపోయారు. అక్కడి తెల్లజాతి పాలకుల దృష్టిలో స్థానిక నల్లజాతివారితో భారత సంతతికి చెందినవారూ సమానమే. అందుకే 20వ శతాబ్దంలో వర్ణవివక్ష వ్యతిరేకపోరాటంలో నల్లజాతివారితో కలిసి భారత సంతతి జనం పోరాడారు. తెలుగువారిలో కొందరు తమ ఉనికి తెలుపుకోవడానికి (ఒక వేళ క్రైస్తవంలోకి మారినా) పేరు చివర నాయుడు అని పెట్టుకునేవారు. ఇలాంటి తెలుగు కార్మిక కుటుంబంలో నాయుడు జన్మించారు. డర్బన్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని చాట్స్‌వర్త్‌పట్టణానికి బలవంతంగా వేలాది మంది తెలుగువారిని అక్కడి సర్కారు తరలించింది. నాయుడు పుట్టడానికి 50 సంవత్సరాల ముందే డర్బన్‌నుంచి ఇండియా వెళ్లిపోయిన మోహన్‌దాస్‌గాంధీ చిత్రపటం ఇంటి గోడపై వేలాడదీసి ఉంది. శ్వేతదురహంకార సర్కారుపై ఆఫ్రికా నేషనల్‌కాంగ్రెస్‌(ఏఎన్సీ) సాగించిన సాయుధపోరాటంలో చేరాలని కూడా ఒకానొక దశలో ఆలోచించానని, గాంధీజీ స్పూర్తితో హింసామార్గంలోకి వెళ్లకుండా ఆగిపోయానని నాయుడు చెప్పారు. 
 (సాక్షి నాలెడ్జ్‌సెంటర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement