అమెరికా, రష్యా మధ్య కుదిరిన ఐఎన్‌ఎఫ్ (ఇంటర్మీడియెట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్‌ట్రీటీ) ఒప్పందం రద్దయింది. న్యూ స్టార్ట్ (వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం)కు కాలం చెల్లిపోయిందని ట్రంప్ సర్కార్ గర్జిస్తోంది. ఉత్తర కొరియా మరోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించి అమెరికాకు సవాల్ విసిరింది. చైనా, ఇరాన్‌లు అదే బాటలో నడుస్తున్నాయి. భారత్ కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేయడంతో పాక్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవన్నీ దేనికి సంకేతం? ప్రపంచ దేశాల్లో మరోసారి అణ్వాయుధాల పోటీకి తెరలేస్తుందా?
ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో ఆయుధ నియంత్రణ మంత్రాన్ని ప్రపంచ దేశాలు జపించాయి. అణ్వస్త్రవ్యాప్తి నిరోధానికి గట్టి కృషి చేశాయి. ఇప్పుడా పరిస్థితులు మారిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, ఉద్రిక్తతలు చూస్తుంటే మళ్లీ దేశాల మధ్య ఆయుధ పోటీకి తెరలేస్తుందనే భావన వ్యక్తమవుతోంది. అమెరికా –రష్యా, ఉత్తరకొరియా –అమెరికా, భారత్ –పాక్, ఇజ్రాయెల్ –ఇరాన్‌ల మధ్య జరుగుతున్న పరిణామాలు ఆయుధ పోటీని పెంచుతున్నాయనేది నిపుణుల అభిప్రాయం.
కశ్మీర్‌కి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370 ఆర్టికల్‌ను మోదీ ప్రభుత్వం రద్దు చేయగానే పాక్ బుసలు కొట్టింది. రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్తతలు మంచివి కాదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. దౌత్యపరమైన మార్గాలు విఫలమైతే ఎంతకైనా తెగిస్తామంటూ పాక్ ఆర్మీ హెచ్చరించింది. పాక్ వద్ద 140–150 అణు వార్‌హెడ్‌లు ఉంటే, భారత్ దగ్గర అణు 130–140 వార్‌హెడ్లు ఉన్నాయి. ఈ ఉద్రిక్తతలతో రెండు దేశాలు రక్షణ బడ్జెట్‌ను మరింత పెంచుతాయని అంచనాలున్నాయి. సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా అణ్వాయుధ తయారీ సామర్థ్యం ఉందని చెబుతుండటం ప్రమాద ఘంటికలు మోగిస్తోందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అగ్రరాజ్యం కేంద్రంగానే..
అమెరికా, రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో జరిగిన ఒక్కో ఒప్పందానికి ట్రంప్ సర్కార్ మంగళం పాడేస్తోంది. ఐఎన్‌ఎఫ్‌ను రద్దు చేసిన అగ్రరాజ్యం.. 2021లో ముగిసిపోనున్న న్యూ స్టార్ట్ ఒప్పందాన్నీ పొడిగించబోమంటోంది. మరోవైపు చైనా తనకు ప్రథమ శత్రువుగా మారుతోందని అగ్రరాజ్యం గుర్రుగా ఉంది. చైనా అత్యంత ఆధునిక క్షిపణుల్ని సమకూర్చుకోవడం, వాణిజ్యపరంగా కూడా సవాల్ విసురుతూ ఉండడంతో అమెరికా మరింత ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడానికి సన్నాహాలు ప్రారంభించింది.
‘మాకు, రష్యాకు మధ్య ఆయుధ పోటీ రాబోయే రోజుల్లో మరింత తీవ్రం కానుంది. ఈ పోటీని తగ్గించే ఒప్పందాన్ని ట్రంప్ సర్కార్ తుంగలో తొక్కేసింది. రెండు దేశాల్లోనూ ఆయుధాల తనిఖీ బృందాలు ఏమీ చేయడం లేదు. అమెరికా ఐసీబీఎంలు, జలాంతర్గాములు, బాంబుల తయారీకి ప్రయత్నిస్తోంది. ఈ ఖర్చు ట్రిలియన్ డాలర్లకు చేరుకొని తడిసిమోపెడు కానుంది’ అని ఒకప్పుడు అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందంలో భాగస్వామి అయిన రిచర్డ్ బర్ట్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఆయుధాలను తగ్గించుకునే చర్యలు చేపట్టినప్పటికీ ప్రపంచంలో ఉన్న అణ్వాయుధాల్లో అమెరికా, రష్యా దగ్గరే 90 శాతం ఉన్నాయి. ఈ రెండు దేశాల సైన్యంలో ఉన్న 8వేలకు పైగా వార్‌హెడ్‌లతో ప్రపంచాన్ని సర్వనాశనం చేయొచ్చు. ఇప్పుడు పెద్ద దేశాలే అణ్వాయుధాలు, ఆధునీకరణ అంటూ ఉంటే, చిన్న దేశాలు కూడా పోటీకి సై అంటున్నాయి. అణ్వాయుధ వ్యాప్తిని అరికట్టలేకపోతే, కొత్త దేశాలూ ఆ«యుధాల తయారీ మొదలు పెడతాయి. పెద్ద దేశాలు మరిన్ని ఆయుధాల్ని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తే, చిన్నదేశాలు వాటినే అనుసరిస్తాయి
–జోసెఫ్ సిరిన్‌కోయిన్, ప్లౌషేర్స్ ఫండ్, ప్రపంచ భద్రతా వ్యవహారాల సంస్థ విశ్లేషకుడు
Comments
Please login to add a commentAdd a comment