బుధుడి ఉపరితలం ఇలా...
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, బుధగ్రహం నైసర్గిక స్వరూపాన్ని స్పష్టంగా తెలిపే తొలి చిత్రపటాన్ని విడుదల చేసింది.‘మెసెంజర్’ వ్యోమనౌక ఈ ఫోటోలు తీసింది. దీనివల్ల బుధుడి భూగర్భ చరిత్ర గురించి మరిన్ని పరిశోధనలు చేయడానికి శాస్త్రవేత్తలకు మార్గం సుగమమైంది. ఈ కొత్త నమూనా చిత్రం బుధుని ఎత్తై, లోతైన ప్రాంతాలతోపాటు అనేక ఆసక్తికర విషయాలను చూపుతోంది. భూమధ్య రేఖకు దక్షిణాన ఉన్న ప్రాంతం బుధుడి సగటు ఎత్తు నుంచి అత్యధికంగా 4.48 కి.మీల ఎత్తులో ఉంది. రచ్‌మనినాఫ్ బేసిన్‌లో కొంతభాగం బుధుడి సగటు లోతు కన్నా 5.38 కి.మీల లోతులో ఉంది. ఇక్కడ అగ్నిపర్వత భాగాలు ఉండొచ్చని భావిస్తున్నారు.