మగాళ్లపైనే కేసులు ఎక్కువ!
లండన్: హింసాత్మక ధోరణుల విషయంలో పురుషులకు, మహిళలకు ఎంతో వ్యత్యాసం ఉంటుందని ఒక కొత్త అధ్యయనంలో తేలింది. బాధితుల ఎంపికలో గానీ, హత్య చేసే ప్రాంతం విషయంలోగానీ, హత్య జరిగే విధానంలో గానీ మహిళలు.. పురుషులతో పోలిస్తే వైవిధ్యంగా ఆలోచిస్తారని వెల్లడైంది. ప్రపంచంలో జరిగే ప్రతి 10 హింసాత్మక కేసుల్లో 9 కేసులు మగవారిపైనే నమోదవుతున్నాయి.
1990-2010 మధ్య పురుషులు, మహిళల మధ్య హింసాత్మక ధోరణుల్లో ఉన్న తేడాలను స్వీడిష్ పరిశోధక గ్రూపు పరీక్షించింది. నేర ప్రవృత్తిలో ఇరువురి మధ్య ఉన్న పోలికలు ఏమిటనే విషయాలపై కూడా పరిశోధనలు జరిపింది. కానీ పరిశోధనలో తేలిందేమిదంటే ఇరువురిలోనూ రానురాను హింసాత్మక ధోరణులు తగ్గుముఖం పడుతూ వస్తున్నట్లు కనుగొన్నారు.
మొత్తం 1,570 కేసులను పరిశీలించగా వాటిలో 1,420 కేసులు పురుషులకు సంబంధించినవి కాగా, కేవలం 150 మాత్రమే మహిళలకు సంబంధించినవి. హత్యలు దాదాపుగా ఇళ్లలోనే జరుగుతున్నట్లు వారు కనుగొన్నారు. మహిళలు ఎక్కువగా బుద్ధిపూర్వక హత్యలు, శిశు హత్యలకు పాల్పడగా.. పురుషులు ఆవేశంలో ఎక్కువగా హత్యలు చేస్తున్నట్లు తెలిసింది.