రెబెల్స్ ఘాతుకమే! | Malaysia Airlines Flight 17 Crash Victims | Sakshi
Sakshi News home page

రెబెల్స్ ఘాతుకమే!

Published Sat, Jul 19 2014 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM

రెబెల్స్ ఘాతుకమే!

రెబెల్స్ ఘాతుకమే!

మలేసియా విమానం కూల్చివేతపై బలపడుతున్న అనుమానాలు
 
ఉక్రెయిన్ సైనిక రవాణా విమానమనుకొని క్షిపణిని ప్రయోగించిన రష్యా అనుకూల రెబెల్స్
తమ తప్పిదం పై రష్యాకు వివరణ    
ఆడియో టేపులను బయటపెట్టిన ఉక్రెయిన్ ప్రభుత్వం
 

కీవ్: యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన మలేసియా విమానం కూల్చివేత ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారుల ఘాతుకమేనన్న అనుమానాలు బలపడుతున్నాయి. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్ నుంచి మలేసియా రాజధాని కౌలాలంపూర్‌కు మొత్తం 298 మందితో గురువారం బయలుదేరిన ఎంహెచ్ 17 మలేసియా ఎయిర్‌లైన్స్ విమానం ఉక్రెయిన్ గగనతలంపై 10 కి.మీ ఎత్తులో ప్రయాణిస్తుండగా జరిగిన క్షిపణి దాడిలో కుప్పకూలడం తెలిసిందే. ఈ విమానాన్ని ఉక్రెయిన్ సైనిక రవాణా విమానంగా పొరబడిన తిరుగుబాటుదారులు దాన్ని కూల్చేందుకు క్షిపణి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటన అనంతరం రష్యా మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు, ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారుల మధ్య జరిగిన సంభాషణల ఆడియో రికార్డుల రాతప్రతులను ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ బయటపెట్టింది. ప్రమాదం జరిగిన 20 నిమిషాల తరువాత ఈ సంభాషణలు చోటు చేసుకున్నాయి. ఈ సంభాషణల ప్రకారం ఇగోర్ బెజ్లర్ అనే మిలిటెంట్.. రష్యా నిఘా అధికారి వాలిసి జెరానిన్‌తో మాట్లాడుతూ ‘మేం ఇప్పుడే ఒక విమానాన్ని పేల్చేశాం. అది గాల్లోనే ముక్కలైంది’ అని పేర్కొన్నాడు. అలాగే మేజర్ అనే మిలిటెంట్ ఘటనాస్థలికి వెళ్లి విమాన శకలాలను పరిశీలించాక ‘ఇది నూరు శాతం పౌర విమానమే. అన్నీ సాధారణ వస్తువులే కనిపిస్తున్నాయి’ అని గ్రెక్ అనే మరో మిలిటెంట్‌కు వివరించాడు. దీంతోపాటు తిరుగుబాటుదారుల నాయకుడిగా భావిస్తున్న మైకొలా కొజిత్సిన్‌తో మరో మిలిటెంట్ మాట్లాడుతూ ‘ఇది ప్యాసింజర్ విమానంలా కనిపిస్తోంది. గ్రాబొవొ గ్రామ వెలుపల ఇది పడిపోయింది. మహిళలు, చిన్నపిల్లల మృతదేహాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి’ అని కొజిత్సిన్‌కు వివరించాడు. రష్యా అనుకూల ఉగ్రవాదులే ఈ విమానాన్ని కూల్చేశారని ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పొరోషెంకో శుక్రవారం ఆరోపించారు. అమెరికా నిఘా వర్గాలు కూడా దీన్ని రష్యా అనుకూల తిరుగుబాటుదారుల దుశ్చర్యగా పేర్కొన్నట్లు సీఎన్‌ఎన్ వార్తాసంస్థ తెలిపింది. అయితే ఉక్రెయిన్ వాదనను రష్యా తోసిపుచ్చింది. విమానం కూలిన రోజు దక్షిణ డోనెట్స్‌క్ సమీపంలో ఉక్రెయిన్ ‘బక్-ఎం1’ క్షిపణిల వ్యవస్థ రేడార్ పనిచేసినట్లు గుర్తించామంది.

అంతర్జాతీయ దర్యాప్తునకు డిమాండ్

ఇది అంతర్జాతీయ నేరమని... దీనిపై ద హేగ్‌లోని అంతర్జాతీయ ట్రిబ్యునల్ దర్యాప్తు చేపట్టాలని ఉక్రెయిన్ ప్రధాని యత్సెన్యుక్ డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ సైతం దీనిపై పారదర్శక అంతర్జాతీయ దర్యాప్తు జరగాల్సిందేనన్నారు. ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత రష్యాదేనని ఒబామా ఆరోపించారు. ఉక్రెయిన్‌లోని ప్రభుత్వ బలగాలు, రష్యా మద్దతుతో చెలరేగుతున్న ఉక్రెయిన్‌లోని తిరుగుబాటుదారులు తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని కోరారు.

181 మృతదేహాలు లభ్యం..

మలేసియా విమాన దుర్ఘటనలో మృతిచెందిన మొత్తం 298 మందిలో శుక్రవారానికి 181 మృతదేహాలను సహాయ సిబ్బంది కనుగొన్నారు. తూర్పు ఉక్రెయిన్‌లోని పొలాల్లో మైళ్ల దూరం మేర చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని గుర్తించేందుకు ఘటనాస్థలికి 270 కి.మీ దూరంలోని ప్రభుత్వ అధీనంలోని ఖారివ్ నగరానికి తరలించనున్నారు. మరోవైపు విమానంలోని బ్లాక్‌బాక్స్‌లను తాము స్వాధీనం చేసుకున్నట్లు రష్యా అనుకూల రెబెల్స్ ప్రకటించారు. వాటిని తనిఖీల నిమిత్తం మాస్కో తరలించనున్నట్లు పేర్కొన్నారు.

11 దేశాల ప్రయాణికులు...మొత్తం మృతుల్లో 280 మంది 11 దేశాలకు చెందిన వారని విమాన ప్రయాణికుల జాబితానుబట్టి అధికారులు తేల్చారు. మృతుల్లో 173 మంది నెదర్లాండ్స్ జాతీయులు, 44 మంది మలేసియావాసులు, 28 మంది ఆస్ట్రేలియన్లు, 12 మంది ఇండోనేసియా జాతీయులు, 9 మంది బ్రిటన్ జాతీయులు, నలుగురు జర్మన్ జాతీయులు, నలుగురు బెల్జియం జాతీయులు, ముగ్గురు ఫిలిప్పీన్స్ జాతీయులు, కెనడా, న్యూజిలాండ్, హాంగ్‌కాంగ్‌కు చెందిన ఒక్కో జాతీయుడు ఉన్నారు. మరో 18 మంది ప్రయాణికుల జాతీయతను నిర్ధారించాల్సి ఉంది. మృతుల్లో భారత సంతతికి చెందిన సంజీబ్‌సింగ్ సంధూ (41), ఏంజలీన్ ప్రమీలా రాజంద్రన్ (30) (ఇద్దరూ విమాన సిబ్బంది) ఉన్నారు.

భారతీయులు లేరు: అశోక గజపతిరాజు

విమాన ప్రమాద మృతుల్లో భారతీయులెవరూ లేరని భారత పౌర విమానయానశాఖ మంత్రి అశోక గజపతిరాజు తెలిపారు.  కాగా, ఈ దుర్ఘటన నేపథ్యంలో ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్‌వేస్ ఉక్రెయిన్ గగనతలంపై తమ విమాన రాకపోకలను నిలిపివేశాయి.

ప్రధాని మోడీ సంతాపం.. ఈ దుర్ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల్లో అత్యధికులు నెదర్లాండ్స్ జాతీయులు కావంతో ఆ దేశ ప్రధాని మార్క్ రట్‌కు సంతాపం తెలియజేస్తూ లేఖ రాశారు.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement