రెబెల్స్ అధీనంలో మృతదేహాలు
ఉక్రెయిన్‌లో విమానం కూలిన చోటునుంచి 198 మృతదేహాల తరలింపు
రైల్లో తీసుకెళ్లిన రెబెల్స్ ఐసీఏఓకు అప్పగిస్తామని వెల్లడి
కీవ్(ఉక్రెయిన్): మలేసియా విమానం కూల్చివేత ఘటనలో లభించిన 198 మృతదేహాలను రష్యా అనుకూల తిరుగుబాటుదారులు ఎయిర్‌కండిషన్ రైల్లో ఆదివారం తరలించారు. తూర్పు ఉక్రెయిన్‌లో విమాన శకలాలు పడిన ప్రాంతానికి వెళ్లకూడదని అంతర్జాతీయ సమాజం నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పట్టించుకోకుండా ఆ మృతదేహాలను తీసుకెళ్లారు. విమానం కూలిన ప్రాంతం నుంచి 15 కి.మీ. దూరంలోని టోరెజ్ పట్టణంలోని రైల్వే స్టేషన్లో ఉన్న వ్యాగన్ల ద్వారా తమ అదీనంలోని డోనె స్క్ నగరానికి మూటలుగా కట్టి తరలించారని రియా నొవొస్తీ వార్తాసంస్థ తెలిపింది. స్టేషన్‌లో వెలువడుతున్న దుర్గంధం భరించరానిదిగా ఉందని, ఆ ఏసీ వ్యాగన్లకు సాయుధ తిరుగుబాటుదారులు కాపలాగా ఉన్నారని యూరప్ భద్రత, సహకార సంస్థ (ఓఎస్‌సీఈ) ప్రతినిధి మిఖాయిల్ బోసియుర్కివ్ చెప్పారు. టోరెజ్‌లో రైలు బయలుదేరేముందు వ్యాగన్లను పరిశీలించిన ఓఎస్‌సీఈ.. ఆ రైల్లో 198 మృతదేహాలు ఉన్నాయని స్పష్టం చేసింది. రెబెల్స్ భద్రత నడుమ ఓఎస్‌సీఈ ప్రతినిధులు సంఘటన ప్రదేశాన్ని ఆదివారం సందర్శించారు.
విమాన బ్లాక్‌బాక్స్‌లు కూడా తమ వద్దే ఉన్నాయని, వాటిని అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థ(ఐసీఏఓ)కు అప్పగిస్తామని వేర్పాటువాదుల నేత అలెగ్జాండర్ బరోదాయ్ పేర్కొన్నారు. ఆ సంస్థ ప్రతినిధులు వచ్చే వరకూ మృతదేహాలను తమ అధీనంలో ఉంచుకుంటామని కూడా తెలిపారు. విమానం కూల్చివేతకు కారణమైన క్షిపణులను రష్యానే ఉక్రెయిన్ రెబల్స్‌కు అందించిందని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఆరోపించారు. అయితే గతంలో వెళ్లిన మార్గానికి భిన్న మార్గంలో వెళ్లడం వల్లే క్షిపణి దాడికి విమానం గురైందని ‘ది అబ్జర్వర్’ తెలిపింది. కాగా, విమానం దాడికి గురైన సమయంలో, అదే దారిలో ఆ ప్రాంతానికి చేరువలో ఎయిరిండియా (ఏఐ) విమానం లేదని ఆ సంస్థ సీనియర్ అధికారి స్పష్టం చేశారు. వివాదాస్పదంగా ఉన్న ఆ ప్రాంతం గగనతలంలో మూడు నెలల నుంచి ఏఐ విమానాలు రాకపోకలు సాగించడంలేదన్నారు. రెండు రోజుల క్రితం డీజీసీఏ ఆదేశాల మేరకు అసలు ఉక్రెయిన్ గగనతలాన్ని వినియోగించడం మానివేసామని ఆయన వెల్లడించారు.
అతడి ముందు మృత్యువు చేతులు కట్టుకోవాలి!
అతడిని చూస్తే మృత్యువే ఆమడదూరం పక్కకు తప్పుకుని పోవాలేమో! ఒక్కరూ బతికి బయటపడని ప్రమాదాలను అతడు చివరి నిమిషంలో తప్పించుకున్నాడు. ఈ ఏడాది మార్చి 8న మలేసియాకు చెందిన ఎమ్‌హెచ్ 370 విమానం కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు వెళుతూ అదృశ్యమైపోయింది. విమానంలో ఉన్న 239 మంది ఆచూకీ నేటికీ లేదు. తాజాగా 298 మంది ఉన్న మలేసియా విమానం ఎమ్‌హెచ్ 17 ఉక్రెయిన్‌లోకూలింది. ఈ రెండు విమాన ప్రయాణాలకు టికెట్లను బుక్ చేసుకున్న మలేసియా సైక్లింగ్ జట్టు సభ్యుడు డీజోంగే(29) చివరి నిమిషంలో వాటిని మార్పు చేసుకున్నాడు. తైవాన్‌లో పోటీలో పాల్గొనేందుకు మార్చి 8న ఎమ్‌హెచ్ 370 విమానంలో జోంగే వెళ్లాల్సి ఉండగా మరో విమానానికి తన టికెట్‌ను మార్పు చేసుకోవడంతో బతికి బయటపడ్డాడు. తాజాగా ఎమ్‌హెచ్ 17 విమానంలో ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు.