కట్టుబట్టలతో పాక్ నుంచి సొంతదేశానికి వెళుతోన్న అఫ్ఘాన్ వృద్ధుడు
ఉగ్రవాదం- అగ్రవాదాల ఆధిపత్యపోరులో అమాయక పౌరులు సమిధలవుతున్నారు. నాటి అఫ్ఘాన్ యుద్ధం, నిన్నటి ఇరాక్ యుద్ధం నేటి సిరియా యుద్ధాల్లో సూత్రధారులు, పాత్రధారులు ఎంతమంది చచ్చారోగానీ సాధారణ పౌరులు మాత్రం లక్షల మంది హతమయ్యారు. అవుతూనే ఉన్నారు. సరే, ఎలాగోలా బతికేద్దామని పొరుగు దేశాలకు శరణార్థులుగా వెళితే అక్కడ కూడా వారిని పీక్కుతినే రాబందులు తయారయ్యాయి.
ఇప్పటికైతే యూరప్ నుంచి సిరియా శరణార్థుల తిరుగు ప్రయాణాలు మొదలు కాలేదుగానీ పారిస్ దాడుల అనంతరం ఆ పరిణామం కచ్చితంగా తలెత్తుతుంది. అందుకు ఉదాహరణే పాకిస్థాన్లో అప్ఘనిస్థాన్ శరణార్థుల గోస. గత డిసెంబర్లో పెషావర్ సైనిక స్కూల్పై పాక్ తాలిబన్ల దాడి అనంతరం.. అఫ్ఘాన్ శరణార్థులపై దాడులు పెరిగిపోయాయి. అధికారికంగా వెల్లడించనప్పటికీ అఫ్ఘాన్లను తమ సొంతదేశానికి వెళ్లగొట్టడమేపనిగా పెట్టుకున్నారు పాకిస్థాన్ పోలీసులు. అంతర్జాతీయంగా ఖ్యాతి పొందిన హ్యూమన్ రైట్స్ వాచ్(హెచ్ఆర్డబ్ల్యూ) సంస్థ తాజాగా వెలువరించిన నివేదిక.. పాక్లో అఫ్ఘాన్ శరణార్థులపై సాగుతున్న హింసను మరోసారి ప్రపంచం ముందుంచింది.
ప్రధానంగా ఈశాన్య పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్లో తలదాచుకున్న అఫ్ఘన్ శరణార్థులపై ఆ రాష్ట్ర పోలీసులు పాశవిక దాడులు చేస్తున్నారని హెచ్ ఆర్ డబ్ల్యూ పేర్కొంది. అఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లోని ఖైబర్ ప్రావిన్స్కు గడిచిన 30 ఏళ్ల నుంచీ శరణార్థుల రాక కొనసాగుతూనే ఉంది. అఫ్ఘానిస్థాన్ పై అమెరికా యుద్ధం తర్వాత ఆ సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటివరకు పాక్లో తలదాచుకునేందుకు వచ్చిన శరణార్థుల సంఖ్య 50 లక్షలకు తక్కువ ఉండదని అంచనా. నాటి రాజకీయ పరిస్థితుల కారణంగా.. శరణార్థులపై కనికరం చూపకున్నప్పటికీ వారిపై హింస జరిగేదికాదని, 2014, డిసెంబర్ 26 నాటి పెషావర్ సైనిక స్కూల్ దాడి తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని హక్కుల సంస్థ తెలిపింది.
అఫ్ఘానిస్థాన్ నుంచి వచ్చి అక్రమంగా నివసిస్తున్నవారిపైనేకాక అధికారికంగా పేర్లు నమోదుచేయించుకున్న వారిని కూడా పోలీసులు వదలడం లేదని, వారు నివసించే ఇళ్లు, చిన్న చిన్న దుకాణాలను ధ్వంసం చేయడం, మేకలు, గొర్రెల్లు, కోళ్లను ఎత్తుకెళ్లడంతోపాటు బలవంతంగా లంచాలు వసూలు చేయడం, మాట వినకుంటే జైళ్లలో పెట్టి హింసించడం వంటి పాశవిక చర్యలు.. పెషావర్ దాడి తర్వాత స్వసాధారణమైపోయాయి. దీంతో పాక్ లో బతకలేక తిరిగి అఫ్థాన్ వెళ్లిపోతున్న శరణార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
పెషావర్ దాడి జరిగిన తర్వాతి మూడు నెలల్లో దాదాపు 60 వేల మంది శరణార్థులు సొంతదేశానికి వెళ్లిపోయారు. ప్రస్తుతం కూడా ఆ పరంపర కొనసాగుతూనే ఉంది. ఇదే విషయంపై ఖైబర్ ప్రావిన్స్ పోలీస్ చీఫ్ మోయిన్ సయీద్ మాట్లాడుతూ 'అఫ్ఘాన్ శరణార్థుల నుంచి లంచాలు గుంజుతున్నారనే ఫిర్యాదులు నిజమే. వాటికి సంబంధించి కొందరు పోలీసుల్ని సస్పెండ్ చేశాం. మరికొందరిని డిస్మిస్ కూడా చేశాం' అని చెప్పుకొచ్చారు. శరణార్థులకు రక్షణ కల్పించడం తమ కనీస బాధ్యతని, లోపాలను సరిదిద్దుకుంటామని ఖైబర్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ముస్తాఖ్ ఘనీ మీడియాకు వివరించారు.
ఖైబర్ ప్రావిన్స్ లో పోలీసులు ధ్వంసం చేసిన అఫ్ఘాన్ శరణార్థుల ఇళ్లు..
పాక్ లో బతకలేక అఫ్ఘాన్ పయనమైన శరణార్థి కుటుంబం..
మూటాముల్లె సర్దుకుని సొంతదేశానికి వెళ్లే ప్రయత్నంలో అఫ్ఘాన్ శరణార్థి మహిళలు