అనగనగా చైనాలోని చాంగ్‌జౌ ఊరు..
అక్కడ ఓ ఆబ్సెంట్ మైండ్ అప్పారావు.. మన కథలోని హీరో ఇతడే.
ఈ మధ్యన అప్పారావు యాన్‌చెంగ్ జూకు వెళ్లాడు. మనోడసలే చిన్న పిల్లాడి టైపు.
జూలోని జంతువులను చూస్తే చాలు. వాళ్లలాగే కేరింతలు కొడతాడు.
ఇక ఎలుగుబంట్లు అంటే మనోడికి చిన్నప్పటి నుంచే చాలా ఇష్టం..
అందుకే వాటి కోసం యాపిల్‌లు కూడా తీసుకెళ్లాడు.
స్కై ట్రెయిన్ రైడ్ ఎక్కాడు. రైలు.. ఎలుగు బంట్లు ఉన్న ఎన్‌క్లోజర్ వద్దకు వచ్చింది.
ఆబ్సెంట్ మైండ్ అప్పారావు ఆనందానికి పట్టపగ్గాలు లేవు.
ఇదిగో యాపిల్ అని విసిరాడు. అసలే అయోమయం.
దీంతో తొందరలో కుడి చేతిలోని యాపిల్‌కు బదులుగా.. ఎడమ చేతిలోని యాపిల్ ఫోన్‌ను విసిరేశాడు.
విషయం అర్థం కావడానికి మనోడికి రెండు నిమిషాలు పట్టింది.
ఎలుగుబంట్లకు అంత టైము పట్టలేదు..
ఆపిల్స్ తినీతినీ.. వాటికీ తెలివి బాగా పెరిగినట్లుంది.
అది మామూలు యాపిల్ కాదని. చాలా ఖరీదైన యాపిల్ అన్న విషయాన్ని గ్రహించాయి.
లటుక్కున నోట కరుచుకుని.. చటుక్కున తమ బోనులోకి దూరిపోయాయి.
జూవాళ్లు వచ్చారు.. బోనులోకి వెళ్లారు..
యాపిల్‌ను బయటకు తెచ్చారు..
కానీ.. అంతలోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
బోనులోకి వెళ్లేముందు.. కొత్త రూపాయి నాణెంలా ఉన్న ఆ ఫోను.
బయటికి వచ్చేసరికి.. రైలు పట్టాల మీద పెట్టిన రూపాయి నాణెంలా తయారైంది.
అదండి సంగతి.. కథ కంచికి.. ఆబ్సెంట్ మైండ్ అప్పారావు ఇంటికి.
- సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment