విస్కాన్సిన్(యూఎస్) : చెడుగా ఆలోచించి చేసే పనులు తప్పకుండా ఇబ్బందుల పాలు చేస్తాయి. తాజాగా ఇండియానాకు చెందిన టామీ లీ జెంకిన్స్ కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. తనకు ఫేస్‌బుక్‌లో పరిచయమైన 14 ఏళ్ల మైనర్ బాలికతో శృంగారం కోసం ఏకంగా ఇండియానా నుంచి విస్కాన్సిన్ వరకు 565 కి.మీ నడిచాడు. కానీ ఆ తర్వాత తాను చాట్ చేసింది.. ఓ పోలీసు అధికారితో అని తెలుసుకుని ఖంగుతిన్నాడు. చివరకు చట్టవిరుద్ధమైన చర్యకు పాల్పడిన కేసులో అరెస్టు అయ్యాడు.
వివరాల్లోకి వెళితే.. యూఎస్‌లో చిన్నారులపై పెరిగిపోతున్న లైంగిక వేధింపులను ఆరికట్టడానికి అక్కడి అధికారులు పలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఒక అధికారి కైలీ అనే పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను క్రియేట్ చేశారు. కైలీ వయసు 14 ఏళ్లు అని, విస్కాన్సిన్‌లోని నిన్హా ప్రాంతంలో ఉంటుందని పేర్కొన్నారు. కైలీ అకౌంట్ నుంచి పంపిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను జెంకిన్స్ యాక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత జెంకిన్స్.. లైంగిక పరమైన అంశాలు చర్చించడం మొదలుపెట్టాడు. అలాగే నగ్న ఫొటోలు పంపిచాల్సిందిగా కోరేవాడు. ఇటీవల కైలీని తనను కలవాల్సిందిగా కోరాడు. దానికి ఆమె అంగీకరించడంతో.. అతను ఇండియానా నుంచి విస్కాన్సిన్‌కు నడక ప్రారంభించాడు. ఈ క్రమంలోని తన వివిధ ప్రాంతాల్లో దిగిన ఫొటోలను కైలీకి పంపించాడు. ఇదంతా గమనిస్తున్న అధికారులు జెంకిన్స్ నిన్హా చేరుకోగానే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కంప్యూటర్ ద్వారా మైనర్ బాలికను ప్రేరేపించడం లేదా ప్రలోభపెట్టినందుకు గాను అతనిపై కేసు నమోదు చేశారు. జెంకిన్స్‌పై నమోదైన కేసు ఫెడరల్ కోర్టులో అక్టోబర్ 23వ తేదీ విచారణకు రానుంది. ఇలా మైనర్‌తో శృంగారం కోసం జెంకిన్స్ 565 కి.మీ నడిచి.. చివరకు చిక్కుల్లో పడ్డాడు. అతను దోషిగా తెలితే.. కోర్టు 10 ఏళ్లు జైలు శిక్ష విధించనుంది.
ఈ ఘటనపై యూఎస్ అటార్నీ మాథ్యూ క్రూగర్ మాట్లాడుతూ.. ‘ఇటీవలి కాలంలో తమ ప్రాంతంలో బాలికలపై లైంగిక వేధింపులు పెరిపోయాయి. మైనర్ బాలికలపై వేధింపులకు పాల్పడేవారికి ఇంటర్నెట్ ద్వారా వారి పని సులభం అయిపోతుంది. అయితే అలాంటి వారిని శిక్షించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామ’ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment