ఫేస్‌బుక్ సీఈవో గోల్స్ ఇవే..
న్యూయార్క్: కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దాదాపు అందరూ ఏదో ఇక నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. కొందరైతే తాగుడు మానాలనో, వ్యాయామం చేయాలనో ఇలా ఓ లక్ష్యాన్ని పెట్టుకొని దానికోసం ప్రయత్నిస్తుంటారు. అయితే ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కూడా కొత్త సంవత్సరానికి కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నారు.
దీనిపై తన ఫేస్బుక్ పేజిలో 'ప్రతి సంవత్సరం కొత్తగా ఏదైనా నేర్చుకోవాని, ఫేస్బుక్ వ్యవహారాల్లో మాత్రమే కాకుండా ఇతర విషయాల్లో సైతం వృద్ధి సాధించాలని నిర్ణయం తీసుకుంటాను. ఇటీవలి సంవత్సరాల్లో నెలకు రెండు పుస్తకాలు చదవాలని, ప్రతిరోజు ఓ కొత్త వ్యక్తిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. అలాగే 2016లో నేను వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే.. ఇంటి నిర్వహణకు, చిన్న చిన్న పనులకు సహకరించేలా ఉండే ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ను తయారుచేయాలనుకుంటున్నాను. ఐరన్ మ్యాన్ సినిమాలోని జార్విస్ తరహా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్గా దీనిని మీరు భావించవచ్చు' అని పోస్ట్ చేసి తన నూతన సంవత్సర లక్ష్యాలను వెల్లడించారు.
ఈ తరహా టెక్నాలజీ ఇప్పటికే ఉంది కానీ దీనిని మరింత అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు జుకర్ తెలిపారు. ఇంట్లోని లైట్లు, ఉష్ణోగ్రత, మ్యూజిక్ మొదలైన వాటిని తన వాయిస్‌తో కంట్రోల్ చేసేలా కృత్రిమ మేధస్సును తయారుచేయాలని భావిస్తున్నట్లు జుకర్ బర్గ్ తన మనసులోని మాటను వెల్లడించారు.