వాషింగ్టన్: భారత్‌లో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశ ఎన్నికల వ్యవస్థ సమగ్రతకు గౌరవమివ్వటంతోపాటు ఫేస్‌బుక్‌లో వినియోగదారుల భద్రతను పటిష్టం చేస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు. వినియోగదారుల భద్రతతో ఆయాదేశాల సమగ్రతను కాపాడేందుకు నిర్ణయించినట్లు..ఆయన గురువారం వెల్లడించారు. భారత్, బ్రెజిల్ తదితర దేశాల్లో ఎన్నికలు జరగనున్నందున.. ఫేస్‌బుక్ భద్రతను పటిష్టపరచనున్నట్లు జుకర్‌బర్గ్ తెలిపారు.
ఇందుకోసం కృత్రిమ మేధస్సు (ఆర్టి ఫీషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ) టూల్స్ ద్వారా ఫేక్ అకౌంట్లను గుర్తించటం, ఎన్నికలను ప్రభావితం చేసే యాప్‌లను తొలగించే పని ప్రారంభమైందన్నారు. తాజా గందరగోళం నేపథ్యంలో తొలిసారిగా బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చిన జుకర్‌బర్గ్.. వినియోగదారుల విశ్వాసానికి భంగం కలిగించినందుకు క్షమాపణలు కోరారు. ఇకపై ఎలాంటి పొరబాట్లు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తామని వెల్లడించారు.
కృత్రిమ మేధస్సుతో నిరంతర సమీక్ష
‘2016 ఎన్నికల తర్వాత మేం రూపొందించిన ఏఐ టూల్స్ ద్వారా ఈ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు సృష్టించిన 30వేల (రష్యాకు చెందినవిగా భావిస్తున్న) ఫేక్ అకౌంట్లను తొలగించాం. ఫ్రాన్స్ ఎన్నికల్లో అలాంటి బయటి శక్తుల ప్రభావం ఉండకుండా జాగ్రత్తపడ్డాం. 2017 అలబామా ఎన్నికల్లోనూ కొత్తగా రూపొందించిన ఏఐ కారణంగా, ఫేక్ అకౌంట్లు, తప్పుడు వార్తలను అడ్డుకోగలిగాం. అమెరికాలో 2018లో జరగనున్న మిడ్‌టర్మ్ ఎన్నికలతోపాటు, భారత్, బ్రెజిల్‌లలో జరగనున్న ఎన్నికల్లోనూ ఇలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోవటంపై దృష్టిపెడతాం. భారత్‌లో ఈ ఏడాది చాలా పెద్ద ఎన్నిక జరగనుంది.
అందుకే వారి ఎన్నికల వ్యవస్థ సమగ్రతను గౌరవిస్తూ.. ఫేస్‌బుక్‌ను భద్రంగా మారుస్తాం’ అని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. వివిధ దేశాల ఎన్నికల్లో రష్యా వంటి దేశాల ప్రభావం ఉండకుండా ఫేస్‌బుక్ మరింత కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు. డేటా భద్రతపై ప్రస్తుతం పనిచేస్తున్న నిపుణుల సంఖ్యను రెట్టింపుచేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది చివరికల్లా 20వేల మంది కేవలం భద్రతపైనే పనిచేస్తారన్నారు. ఫేస్‌బుక్ డేటా లీకేజీపై భారత ప్రభుత్వం సీరియస్‌గా స్పందిస్తూ.. ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని, జుకర్‌బర్గ్‌ను భారత్‌కు పిలిపించి విచారణ జరపాల్సి ఉంటుందని హెచ్చరించిన సంగతి తెలిసిందే.
అమెరికా ఎన్నికలపై అదృశ్య హస్తం!
ఫేస్‌బుక్ వివరాల ద్వారా అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారని జుకర్‌బర్గ్ వెల్లడించారు. 2016 ఎన్నికల్లో రష్యా ప్రయత్నించినట్లుగానే.. ‘వర్షన్ 2’తో కుటిలయత్నాలు జరుగుతున్నాయి. కొత్త వ్యూహాలతో జరుగుతున్న ఈ ప్రయత్నాలను గుర్తించి వాటిని ఎదుర్కొనాల్సిన అవసరం ఉంది’ అని తెలిపారు.
నన్ను క్షమించండి
ప్రపంచవ్యాప్తంగా 5కోట్ల వినియోగదారుల వివరాల లీకేజీపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్ క్షమాపణలు తెలిపారు. వినియోగదారుల విశ్వాసానికి భంగం కలిగిందని, తమవైపు నుంచి తప్పు జరిగిందని.. ఇకపై అలా జరగకుండా డేటా వివరాలను మరింత భద్రంగా చూసుకుంటామన్నారు. ‘నేను ఫేస్‌బుక్‌ను ప్రారంభిం చాను. ఈ వేదిక ద్వారా ఏం జరిగినా దానికి నేనే బాధ్యుడిని. నన్ను క్షమించండి. మన సమాజ సమాచారాన్ని భద్రంగా ఉంచేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. ఇకపై ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాం’ అని కేంబ్రిడ్జ్ అనలిటికా వివాదం అనంతరం తొలిసారిగా జుకర్‌బర్గ్ ప్రకటన చేశారు. ‘నేను యువకుడిగా, సరైన అనుభవం లేనప్పుడు సంస్థను ప్రారంభించాను. సాంకేతికతంగా,వాణిజ్యపరంగా తప్పులు దొర్లాయి. చాలా సందర్భాల్లో తప్పుడు వ్యక్తులను ఉద్యోగంలోకి తీసుకున్నాను. అదే నా పొరపాటు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment