న్యూయార్క్‌లో భారీ పేలుడు | Massive explosion in New York | Sakshi
Sakshi News home page

న్యూయార్క్‌లో భారీ పేలుడు

Published Mon, Sep 19 2016 5:14 AM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM

న్యూయార్క్‌లో భారీ పేలుడు - Sakshi

న్యూయార్క్‌లో భారీ పేలుడు

- 29 మందికి గాయాలు.. మన్‌హటన్ శివారులో దుర్ఘటన  
- మరో బాంబు స్వాధీనం
- ఉగ్రవాదంతో సంబంధం లేదన్న మేయర్
- నేటి నుంచి నగరంలో ఐరాస సమావేశాలు
 
 న్యూయార్క్:
ఇటీవలే ‘9/11’ ఉగ్రదాడుల మృతులకు నివాళి అర్పించిన అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ అలజడి! న్యూయార్క్ మన్‌హటన్ శివారులోని చెల్సియాలో ఓ చెత్తకుండీలో శక్తిమంతమైన పేలుడు సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8.30కి జనసమ్మర్ద ప్రాంతంలో జరిగిన ఈ పేలుడు ధాటికి 29 మంది గాయపడ్డారు. చుట్టుపక్కల భవనాల కిటికీలు, వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. మరోపక్క.. ఈ ప్రాంతానికి దగ్గర్లోనే ప్రెజర్ కుక్కర్ బాంబు హడలెత్తించింది. వైర్లతో కూడిన దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు.

ఇది 2013లో బోస్టన్ మారథాన్‌లో జరిగిన పేలుడుకు వాడిన కుక్కర్ బాంబును పోలి ఉందని అధికారులు తెలిపారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల కోసం దేశాధ్యక్షుడు ఒబామా సహా ప్రపంచ నేతలు నగరానికి వస్తున్న నేపథ్యంలో ఈ ఉదంతాలు చోటు చేసుకున్నాయి. న్యూజెర్సీలోనూ శనివారం ఓ పైపు బాంబు పేలింది. కాసేపటి తర్వాత చెల్సియా పేలుడు సంభవించింది. పిడుగుపడినట్లు భారీ శబ్దంతో సంభవించిన పేలుడుకు ఆ ప్రాంతం కంపించిపోయిందని, తాను భోంచేస్తున్న హోటల్లోంచి అందరూ వీధుల్లోకి పరిగెత్తారని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. రెస్టారెంట్లు, సబ్‌వే స్టేషన్లు, ఆర్ట్ గ్యాలరీలతో కూడిన చెల్సియాలో వారాంతం రద్దీగా ఉంటుంది. నడిబొడ్డున ఉన్న 23వ వీధిలో తాజా పేలుడు సంభవించింది.

 ఉద్దేశపూర్వక దాడి..  బాధితులకు తీవ్ర గాయాలయ్యాయని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని నగర మేయర్ బిల్ డి బ్లాసియో తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ఈ దాడికి పాల్పడ్డారని, దీనికి ఉగ్రవాదంతో సంబంధమున్నట్లు ప్రస్తుతానికి తేలలేదని పేర్కొన్నారు. న్యూయార్క్‌కు ప్రస్తుతం ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నట్లు సమాచారమేదీ లేదన్నారు. చెల్సియా ఘటనకు సంబంధించి ఏ సంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు. క్షతగాత్రులందర్నీ డిశ్చార్జి చేసినట్లు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కువోమో తెలిపారు. తనిఖీల కోసం మరో వెయ్యిమంది పోలీసుల్ని నియమిస్తామన్నారు.

న్యూయార్క్‌లో పేలుడు అంటే ఉగ్రవాదమేనని, అయితే అంతర్జాతీయ ఉగ్రవాదంతో దీనికి సంబంధం లేదన్నారు. ఈ ప్రాంతంలో రికార్డయిన నిఘా వీడియోలో.. ఘటనాస్థలి వద్ద  ఓ వ్యక్తి కనిపించాడని, అతనికి పేలుడుకు సంబంధముందో కనుగొనేందుకు యత్నిస్తున్నామని  పోలీసులు చెప్పారు. ఈ ప్రాంతంలో సోదాలు చేస్తున్నామన్నారు. . పేలుడుకు కచ్చితమైన కారణం తెలియడం లేదని శనివారమే న్యూయార్క్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యత తీసుకున్నఓనీల్ పేర్కొన్నారు. 2011సెప్టెంబర్ 11(9/11)న ఉగ్రదాడికి గురైన న్యూయార్క్‌లో అదనపు భద్రత కొనసాగుతోంది. చెల్సియా పేలుడు వివరాలను అధికారులు ఒబామాకు, దేశాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న హిల్లరీకి  తెలిపారు.
 
 మినెసోటాలో 8 మందికి కత్తిపోట్లు
 న్యూయార్క్ లో బాంబు పేలుడు జరిగిన సమయంలో మినెసోటాలో ఓ ఆగంతకుడు ‘అల్లాహ్’ అని అరుస్తూ ఓ షాపింగ్‌మాల్‌లో చొరబడి 8 మందిని గాయపర్చాడు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది అతన్ని కాల్చి చంపారు. కాగా, దాడికి ముందు దుండగుడు పలువురిని ‘మీరు ముస్లింలా?’ అని ప్రశ్నించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనను ఉగ్రదాడిగా అనుమానించడంలేదని, అయినప్పటికీ ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు భద్రతాధికారులు తెలిపారు. తమకు తుపాకీ చప్పుళ్లు వినపడటంతో పరుగులు తీసినట్లు ప్రత్యక్షసాక్షులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.
 
 న్యూజెర్సీలోనూ పేలుడు
 సీసైడ్ పార్క్(న్యూజెర్సీ): అమెరికాలోని సముద్ర  పట్టణమైన న్యూజెర్సీలో పైప్ బాంబు పేలుడు సంభవించింది. ఎవరూ గాయపడలేదు. స్వచ్ఛంద సాయం కోసం చేపట్టిన 5కే రన్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నారు. పరుగు ప్రారంభించిన కొద్దిసేపటికే ఈ బాంబు పేలుడు చోటుచేసుకుంది. అయితే ఇది ఉగ్రవాదుల పనా? కాదా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలతాయని అధికారులు పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement