
మూడేళ్లకే మేయర్!
మూడేళ్ల వయసు పిల్లలు ఎలా ఉంటారు?
షికాగో: మూడేళ్ల వయసు పిల్లలు ఎలా ఉంటారు? బుడిబుడి నడకలు, ముద్దులొలికే మాటలు, అమ్మ ఒడే లోకం. కానీ, ఇదే వయసున్న బుడ్డోడు ఏకంగా ఓ నగరానికి మేయరయ్యాడు? ఇది చదువుతున్న మీకే ఇంత ఆశ్చర్యంగా ఉంటే ఈ బుల్లిబాబును చూసిన వారికి ఇంకెంత ఆశ్చర్యంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి.
విషయమేంటంటే.. అమెరికాలోని ఉత్తర మిన్నెసొటా రాష్ట్రంలో పర్యాటకమే ప్రధాన వనరుగా ఉన్న డోర్సెట్ అనే నగరానికి ముద్దులొలికే జేమ్స్ టఫ్ట్స్ (3) ఇటీవల మేయర్‌గా ఎన్నికయ్యాడు. ఆగస్టు 2న ఈ మేరకు ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. ఈ నగరంలో చిన్నపిల్లాడు మేయర్‌గా పనిచేయడం ఇదేం కొత్త కాదు. ఇంతకుముందు జేమ్స్ అన్న రాబర్ట్ టఫ్ట్స్ కూడా ఇదే నగరానికి మేయర్‌గా పనిచేశాడు. ఒక్కసారి కాదు రెండుసార్లు 3 ఏళ్ల వయసులో ఒకసారి, 4 ఏళ్ల వయసులో మరోసారి.
అంతేకాదు, ఇతరులతో ఎలా మెలగాలో తన తమ్ముడికి అప్పుడే జాగ్రత్తలు కూడా చెప్పేస్తున్నాడు. పెద్దవారు పలకరిస్తే.. ముద్దు ముద్దుగా మాట్లాడకుండా గంభీరంగా ఉండాలని సలహాలిస్తున్నాడు. ఎంతైనా అనుభవజ్ఞుడు కదా! ఒకే కుటుంబం నుంచి ఇద్దరు మేయర్లు కావడంపై వారి తల్లి ఎమ్మా టఫ్ట్స్ పుత్రోత్సాహంతో పొంగిపోతోంది.