
నిద్రపోతే ప్రాణం పోతుంది!
మెదడుకు, శరీరానికి విశ్రాంతినిచ్చేది నిద్ర. ప్రతి ఒక్కరూ రోజూ తగినంత నిద్రపోతేనే ఇతర జీవక్రియలు సక్రమంగా సాగుతాయి. నిద్ర ఎవరికైనా ప్రశాంతతను అందిస్తుంది. జీవితంలో ఎన్ని సమస్యలున్నా, నిద్రలో అన్నీ మర్చిపోతాం. ఇది దాదాపు అందరికీ వర్తిస్తుంది. కానీ, లియామ్ డెర్బిషైర్ అనే టీనేజ్ యువకుడికి మాత్రం కాదు. ఎందుకంటే అతడికి నిద్రపోవడమంటేనే ప్రాణాలను పణంగా పెట్టినట్టు. అవును లియామ్ నిద్రపోతే, ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే నిద్రపోగానే, శ్వాస ఆగిపోయే అరుదైన వ్యాధితో అతడు బాధపడుతున్నాడు. కానీ, ఆ సమస్యతో ఏళ్లుగా పోరాటం సాగిస్తూ, తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు.
అరుదైన సమస్య..
బ్రిటన్‌కు చెందిన లియామ్ డెర్బిషైర్ అనే యువకుడికి ఓ అరుదైన వ్యాధి ఉంది. వైద్య పరిభాషలో దీన్ని ‘సెంట్రల్ హైపోవెంటిలేషన్’ లేదా ‘ఆన్‌డైన్స్ కర్స్’ అంటారు. ఈ సమస్య ఉన్న వారు నిద్రపోతే, ఊపిరి ఆగిపోతుంది. అంటే వారు నిద్రలో శ్వాసతీసుకోలేరు. నిద్రపోగానే, శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది. దీంతో తమ ప్రాణాల్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఇది అత్యంత అరుదైన వ్యాధి. ఈ సమస్య ఉన్న వారు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1,500 మంది వరకు మాత్రమే ఉన్నారంటే, ఇది ఎంత అరుదైన సమస్యో అర్థం చేసుకోవచ్చు.
పుట్టుకతోనే..
లియామ్‌కు ‘సెంట్రల్ హైపోవెంటిలేషన్’ సమస్య పుట్టుకతోనే ఉంది. లియామ్ పుట్టిన వెంటనే దీన్ని గమనించిన వైద్యులు, ఆరు వారాలకు మించి బతకలేడని చెప్పారు. ఎందుకంటే దీనికి చికిత్స లేదు. అయితే లియాన్ సమస్య గురించి తెలిసిన తల్లిదండ్రులు, తమ పిల్లాడ్ని బతికించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. లియామ్ నిద్రపోయాక, అతడికి శ్వాస అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం లియామ్ వయసు పద్దెనిమిదేళ్లు. ఆరు వారాలకు మించి బతకడం అసాధ్యం అని చెప్పిన వైద్యుల అంచనాలను తలకిందులు చేస్తూ, అతడు రోజూ మృత్యువుని ఓడిస్తూనే ఉన్నాడు.
నిరంతర పర్యవేక్షణ..
నిద్రపోతే, శ్వాస తీసుకోవడం ఆగిపోయి ప్రాణాలు కోల్పోతాడు లియామ్. ఈ సమస్యను అధిగమించేందుకు అతడి తల్లిదండ్రులు ప్రత్యేక వైద్య సదుపాయాల్ని కల్పించారు. లియామ్ నిద్రలోకి జారుకున్న తర్వాత కృత్రిమ శ్వాసను అందిస్తారు. దీని ద్వారా గుండె, ఊపిరితిత్తులకు తగిన ఆక్సిజన్ అందేలా చేస్తారు. ఈ సేవల కోసం అతడి బెడ్‌రూమ్‌లో ప్రత్యేక పరికరాల్ని అమర్చారు. వీటి ద్వారా నిరంతరం అతడి గుండె పనితీరు, ఇతర అవయవాల్ని పరిశీలిస్తూనే ఉండాలి. ఈ పని చేసేందుకు ఎవరో ఒకరు సుశిక్షితులైన సిబ్బంది పక్కన ఉండాల్సిందే. బాల్యం నుంచి ఈ వైద్య సదుపాయాల ద్వారానే లియామ్ జీవన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. లియామ్ ప్రాణాలతో ఉండాలంటే ఎప్పుడూ బెడ్‌రూమ్‌లో ఇలాంటి ఏర్పాట్లు తప్పనిసరి. ఎన్ని వైద్య సదుపాయాలున్నా, నిద్ర పోయే విషయంలో లియామ్ జాగ్రత్తగా ఉండాల్సిందే. తల్లిదండ్రులు, వైద్యులు నిరంతరం కంటికి రెప్పలా చూసుకుంటూ పర్యవేక్షిస్తుండడం వల్లే ఇదంతా
సాధ్యమైంది. – సాక్షి, స్కూల్ ఎడిషన్