'హిల్లరీలా అధ్యక్ష పదవికి ఆశపడను'
వాషింగ్టన్: అధ్యక్షపదవిపై తనకు అంతగా మోజు లేదని అమెరికా ప్రథమ పౌరురాలు, బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా వ్యాఖ్యానించారు. టెక్సాస్ లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ.. అమెరికాలో రాజకీయాల కంటే కూడా వేరే విషయాలలోనే తన ప్రభావం ఎక్కువగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అధ్యక్షపదవికి బరిలో దిగేందుకు హిల్లరీ క్లింటన్ లా తాను సిద్ధంగా లేనని స్పష్టంచేశారు. దాదాపు 6కోట్ల మంది విద్యార్థినులు స్కూలుకు వెళ్లడం లేదని ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో చెప్పారు. ఈ సందర్భంగా ఆమె ఓ పాటను పాడి వినిపించారు.
ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులుగా... అమెరికా అధ్యక్షపదవి తనకు ఇష్టం లేదని మరోసారి ఆమె ఉద్ఘాటించారు. వైట్ హౌస్ కు బయట ఉంటేనే తాను ఎన్నో పనులు చేయగలనని ధీమా వ్యక్తంచేశారు. తాను బయట ఉంటే సాధారణ పౌరులు కూడా తన మాటలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ చమత్కరించారు. వివాదాలకు అవకాశాలు ఇవ్వకూడదని, సమస్యలపై పోరాడటం తన లక్ష్యమని ఊబకాయం సమస్యపై దృష్టిపెట్టామన్నారు. ఎనిమిదేళ్ల వైట్ హౌస్ నివాసం తర్వాత తన కూతుళ్లు మలియా, సాషాలు ఎక్కడైనా హాయిగా బతకగలిగేలా ఉంటే చాలని, ఇప్పటివరకు మాకు ఇది చాలు అని మిషెల్ ఒబామా వివరించారు.