మిచెల్లీ గురించి ఒబామా ఏమన్నారంటే..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన భార్య మిచెల్లీ ఒబామా రాజకీయ భవితవ్యంపై వస్తున్న వార్తలపై స్పందించారు. 2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో మిచెల్లీ బరిలో ఉండరని స్పష్టం చేశారు.
మిచెల్లీ రాజకీయ ప్రవేశంపై అమెరికాలో పలు రకాల వార్తలు వచ్చాయి. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలిస్తే మిచెల్లీకి మంత్రి పదవి ఇస్తారని తొలుత కథనాలు వినిపించాయి. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ చేతిలో హిల్లరీ ఓడిపోయాక, వచ్చే ఎన్నికల్లో మిచెల్లీ పోటీచేస్తారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఒబామా దీనిపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మిచెల్లీ ఎప్పుడూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరని స్పష్టం చేశారు. ఆమె చాలా ప్రతిభావంతురాలని, అమెరికా ప్రజలతో మమేకమయ్యారని ప్రశంసించారు. కాగా మిచెల్లీకి రాజకీయాలపై పెద్దగా ఆసక్తిలేదని ఒబామా చెప్పారు.