
ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లగా దుండగుడు కాల్పులకు తెగబడినట్టు తెలుస్తోంది. పొట్టలోకి తూట దూసుకుపోవడంతో బాలిక ప్రాణాలు కోల్పోయిందని సెయింట్ లూయిస్ పోలీస్ చీఫ్ జాన్ హెడెన్ వెల్లడించారు.
మిస్సోరి : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో దుండగుడు కాల్పులు జరపడంతో ఎనిమిదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఘటనలో మరో మహిళ, ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా సోల్డాన్ హైస్కూల్ వద్ద ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లగా దుండగుడు కాల్పులకు తెగబడినట్టు తెలుస్తోంది. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. పొట్టలోకి తూటా దూసుకుపోవడంతో బాలిక ప్రాణాలు కోల్పోయిందని సెయింట్ లూయిస్ పోలీస్ చీఫ్ జాన్ హెడెన్ వెల్లడించారు.
బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తుండగా ఘటన జరిగిందని అన్నారు. పాఠశాలలో జరుగుతున్న ప్రీ-సీజన్ ఫుట్‌బాల్ ఈవెంట్‌ను వారంతా చూసేందుకు వచ్చారని తెలిపారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిగినట్టు వెల్లడించారు. ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు వచ్చారని, కాల్పుల అనంతరం హుటాహుటిన ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించామని చెప్పారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఇదిలాఉండగా.. సెయింట్ లూయిస్‌లో గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 12 మంది బాలికలు తూటాలకు బలయ్యారు.