అన్ని కోట్ల మంది యూజ్ చేస్తున్నారా!
న్యూయార్క్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సంస్థ రూపొందించిన ఫేస్ బుక్ లైట్ యాప్ ను ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు వినియోగిస్తున్నారు. నెలవారీగా ఫేస్ బుక్ యాప్ వినియోగంపై సంస్థ జరిపిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ దీనిపై హర్షం వ్యక్తం చేశారు. ఈ యాప్ ను 2015 జూన్ నెలలో లాంచ్ చేశారు. 'సాధారణ ఫేస్ బుక్ యాప్ యూజ్ చేయాలంటే స్మార్ట్ ఫోన్ ర్యామ్ కాస్త ఎక్కువగా ఉండాలి. 1జీబీ కంటే తక్కువ ర్యామ్ ఉన్న స్మార్ట్ ఫోన్లు వాడే యూజర్ల ఇబ్బందులను తొలగించేందుకు సంస్థ ఫేస్ బుక్ లైట్ యాప్ ను ఆవిష్కరించింది' అని జుకర్ బర్గ్ తెలిపారు.
'50 కంటే ఎక్కువ భాషలలో, లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా, యూరఫ్ ఖండాలలో 150కి పైగా దేశాల నెటిజన్లు ఈ యాప్ ను యూజ్ చేస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యూజర్లు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ ఎఫ్బీ యాప్ కంటే లైట్ యాప్ తక్కువ స్పేస్ తీసుకుంటుంది. ప్రోగ్రామర్స్ ఎంతో శ్రమించి రూపొందించిన ఫేస్ బుక్ లైట్ యాప్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సులువుగా లైక్స్, షేర్లు చేయొచ్చు. తక్కువ బ్యాండ్ విడ్త్ ఇంటర్ నెట్ కలిగి ఉన్న నెటిజన్లను దృష్టిలో ఉంచుకుని చేసిన తమ ప్రయత్నానికి విశేష స్పందన వచ్చిందని' ఓ ప్రకటనలో ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ వెల్లడించారు.